మర్రిగడ్డ శివారులోని ఒర్రె ప్రాంతంలో చిల్డ్రన్ కరెన్సీ నోట్లు
పరిశీలిస్తున్న పోలీసులు
చందుర్తి(వేములవాడ): మండలంలోని మర్రిగడ్డ గ్రామ శివారు బోగవాగు ఒర్రె ప్రాంతంలోని చెట్లపొదల్లో రూ.500 దొంగనోట్ల ఉన్నాయన్న ప్రచారం మంగళవారం కలకలం రేపింది. ఉపాధి హామీ కూలీలు వాటిని గమనించి సర్పంచ్ భర్త దూది శ్రీనివాస్‌రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వాటిని పూర్తిగా పరిశీలించకుండానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏఎస్సై ఆనందం, పోలీసులు వాటిని పరిశీలించి చిన్నపిల్లలు ఆడుకునేందుకు మనోరంజన్ బ్యాంకు పేరిట తయారు చేసిన రూ.500 కూపన్లు గుర్తించారు. సదరు కూపన్లు రూ.500 నోటును పోలి ఉండడంతోనే నకిలీ నోట్ల ప్రచారానికి తెరలేపినట్లయింది. కాగా, మర్రిగడ్డలో నకిలీ డంపు ఉందన్న ప్రచారంతో అప్పటికే పలు వురు విలేకర్లు, పోలీసులకు ఫోన్ చేశారు. చిన్న పిల్ల లు ఆడుకునేందుకు తయారు చేసిన కరెన్సీ కూపన్ నోట్లని, ప్రజలు పుకార్లు నమ్మవద్దని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టారు.


