మల్లాపూర్: ఇసుక ట్రాక్టర్ ఢీకొని మండలంలోని నడికుడకు చెందిన లష్కర్ యార గంగారాం(50) మృతిచెందిన ఘటన పాతదాంరాజుపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. గంగారాం ఇరిగేషన్‌లో లష్కర్‌గా పనిచేస్తున్నాడు. బైక్‌పై మల్లాపూర్ వెళ్లి విధులు ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా.. జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గంగారాంకు భార్య దేవగంగు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురుకు పెళ్లయ్యింది. వచ్చేనెల 8న చిన్న కూతురుకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో గంగారాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. మృతదేహం వద్ద భార్యాపిల్లల రోదన మిన్నంటింది. ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దేవగంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వాహనం ఢీకొని తాపీ మేసీ్త్ర..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి శివారులోని రంగంపల్లి కోర్టు సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఆవునూరి బాపయ్య(33) అనే తాపీమేసీ్త్ర దుర్మరణం పాలయ్యాడు. జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన బాపయ్య.. పనినిమిత్తం రంగంపల్లికి వచ్చి పెద్దపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రంగంపల్లి కోర్టు ప్రాంతంలో వెనకాల వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. తలకు తీవ్రగాయమై బాపయ్య అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు రిశ్విత్, కుమార్తె అశ్విత ఉన్నారు.


