రైతులు సద్వినియోగం చేసుకోవాలి
● ఈ నెల 27నుంచి మే 23వరకు నిర్వహణ
● ఎనిమిది బృందాలు.. 60 సదస్సులు
కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో కాకుండా కాలానుగుణ సాగుకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులను చైతన్యవంతులను చేయడంతో పాటు మార్కెటింగ్ మెలకువలు, సస్యరక్షణ చర్యలపై అవగాహనకు శాస్త్రవేత్తలను రంగంలోకి దించింది. రైతు ముంగిటే శాస్త్రవేత్త పేరుతో కార్యక్రమాన్ని రూపకల్పన చేయగా జిల్లాలో 60 సదస్సులు నిర్వహించనున్నారు. తెలంగాణ రైతు విజ్ఙాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిపి 8బృందాలుగా విభజించగా జిల్లా క్లస్టర్ ఇన్‌చార్జిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ డా.బోగారి హరికృష్ణను నియమించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనుండగా రైతులకు అవగాహన కల్పించనున్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభం కాగా శాస్త్రవేత్తలు, అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పించారు.
ఎనిమిది బృందాలు.. బృందానికి ఇద్దరు శాస్త్రవేత్తలు
రైతు వేదికల సంఖ్య క్రమంలో శాస్త్రవేత్తలతో బృందాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది బృందాల్లో 16మంది శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించనున్నారు. శాస్త్రవేత్తలు డా.బి.హరికృష్ణ, కె.మదన్‌మోహన్‌రెడ్డి, బి.రాంప్రసాద్, జి.ఉషారాణి, ఈ.రజనీకాంత్, ఈ.ఉమారాణి, ఐ.తిరుపతి, జె.రాకేష్, కె.రాజేంద్రప్రసాద్, కె.స్వాతి, అఖిల, పి.రవి, కె.రామకృష్ణ, పి.మధుకర్, జి.మౌలిక సాగులో వైవిధ్యం, లాభాలు, సేద్యంలో ఎదురయ్యే సమస్యలు, చీడపీడల నివారణ, సాగు భూమి సస్యరక్షణ తదితర వివరాలను వివరించనున్నారు.
చిరుధాన్యాలు.. ఆరుతడి పంటలు
చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న సంకేతాల క్రమంలో వచ్చే వానాకాలం, యాసంగి సీజన్‌లలో ఏ ఏ పంటలు వేయాలనే అంశాలను వివరిస్తున్నారు. వరి, పత్తిని తగ్గించి మక్క, కంది, పెసర, మినుములు, అలసంత, పసుపు, మిరప, సోయాబీన్, ఆవాలు, నువ్వులు, కుసుమ, జొన్న, సజ్జ, ఆనుములు, గోధుమలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు అలాగే పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని చెబుతున్నారు. యూరియా వాడకం తగ్గింపు, యాప్ ద్వారా యూరియా బుకింగ్, సాగు నీటి ఆదా, సేంద్రియ ఎరువుల వాడకం, భూసార పరీక్షల నిర్వహణ, పెట్టుబడి ఖర్చు తగ్గింపు, ఎఫ్‌పీవోల విస్తరణ, పంట ఉత్పాదకాల కొనుగోలులో జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
సమస్యలపై రైతుల ఏకరవు
రైతు ముంగిటే శాస్త్రవేత్త కార్యక్రమాల్లో రైతులు తమ సమస్యలు, డిమాండ్లను ఏకరవు పెడుతున్నారు. ప్రధానంగా కోతులు, అడవి పందుల బెడదను నివారిస్తే ఏ పంట వేయమన్న వేస్తామని రైతులు స్పష్టం చేశారు. అన్ని రకాల విత్తనాలకు 50శాతం రాయితీ ఇవ్వాలని, అతివృష్టి, అనావృష్టితో పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని, రైతువారిగా పంటల బీమా అమలు చేయాలని కోరుతున్నారు. భూసార పరీక్షలను విస్తృతం చేయాలని, కూలీల కొరత లేకుండా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని, బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీపై ఇవ్వాలని వివరించారు. అన్ని పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులపై ఉక్కుపాదం మోపాలని కోరారు.
రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు వస్తున్నందున ప్రతీ రైతు హాజరై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణలో చూపాలి. రైతులు తమ సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
– డా.బోగారి హరికృష్ణ, జిల్లా క్లస్టర్ ఇన్‌చార్జి


