ట్రాక్టర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ దగ్ధం

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

కొడిమ్యాల: రన్నింగ్‌లో ఉన్న ఓ ట్రాక్టర్‌లో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని నల్లగొండలో చోటుచేసుకుంది. నమిలకొండ గ్రామానికి చెందిన ఇటుకబట్టీల నుంచి వేములవాడ వైపు ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్‌ ట్రాక్టర్‌ను రోడ్డు పక్కకు ఆపి కిందకు దూకాడు. ఎండ తీవ్రతతో ఇంజిన్‌ అధికంగా వేడెక్కి షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు వ్యాపించాయని అక్కడున్న వారు చర్చించుకున్నారు.

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

పెగడపల్లి: మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయగా ముగ్గురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన చెనాల విజయ, జున్నమరియా, జున్న పురుషోత్తం ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా వారిపై దాడి చేసి గాయపర్చింది. బాధితులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. గ్రామంలో కుక్కుల బెడద ఎక్కువైందని, నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

మహీంద్రా కంపెనీలో ఉద్యోగావకాశాలు

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు మహీంద్ర కంపెనీలో ఉద్యోగావకాశాలున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌ తెలిపారు. ఈ నెల 30న కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియం పక్కన గల స్వశక్తి కళాఽశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో ఉదయం 10గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని వివరించారు. వేతనం హోదాను బట్టి రూ.13వేల నుంచి రూ.15,300 వరకు ఉంటుందని, వయసు 18– 25 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్‌, ఐటీఐ అర్హతతో 300 వరకు ఉద్యోగాలున్నాయని వివరించారు. సబ్సిడీతో కూడిన భోజనంతో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కుల బహిష్కరణపై కేసు నమోదు

గంగాధర: గంగాధర మండలం మల్లాపూర్‌ గ్రామంలో కుల బహిష్కరణపై కేసు నమోదైంది. మల్లాపూర్‌ గ్రామంలో కొలెపాక కుటుంబ సభ్యులకు, ఇదే గ్రామానికి చెందిన మరికొన్ని కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం సర్పంచ్‌ సమక్షంలో పంచాయితీ నిర్వహించి శుభ, అశుభ కార్యాలకు వెళ్లవద్దని తీర్మానం చేశారు. బాధితుల కుటుంబం నుంచి సురేశ్‌ అనే యువకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కుల పంచాయితీ నిర్వహించిన సర్పంచ్‌ కొలెపాక కవిత, పెద్ద మనుషులు కొలెపాక దిలీప్‌, కొలెపాక రాజయ్య, కొలెపాక స్వామి, కొండయ్య, నర్సయ్య, ఎల్లయ్య, బాబు, రమేశ్‌, మొండయ్య, మల్లేశ్‌, హరీశ్‌పై ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement