మేడిపల్లిః రైల్వేట్రాక్ దాటే సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ హనుమండ్లు కథనం ప్రకారం మండలంలోని తొంబరావుపేటకు చెందిన పుల్లురి భీమయ్య(52) వ్యవసాయకూలీగా పనిచేస్తుంటాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో రైల్వేట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ వైపు వెళ్లే ప్యాసింజర్ రైలు లోకోపైలట్ ట్రాక్‌పై ఉన్న మృతదేహాన్ని చూసి రైల్వే పోలీస్‌లకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. భీమయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మైనర్లే దొంగలు
● చోరీ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు
ధర్మపురి: ధర్మపురికి చెందిన రాపర్తి ప్రభాకర్ ఇంట్లో ఈనెల 26న దొంగతనానికి పాల్పడింది ఇద్దరు మైనర్లు అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ ఇంటితాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ సోమవారం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. వారిని జువైనల్ జడ్జి ముందు హాజరుపర్చి జువైనల్ హోంకు తరలించారు.
ఉద్యోగం పేరిట మోసం చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు
గోదావరిఖనిటౌన్(రామగుండం): సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తికి గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకట సచిన్‌రెడ్డి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. 2016లో యైటింక్లయిన్‌కాలనీకి చెందిన దాడి లక్ష్మయ్య కొడుకు మధుకర్‌కు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి అదే కాలనీకి చెందిన రేపాల సురేందర్ రూ.11 లక్షలు తీసుకున్నాడు. కాలం గడిచిపోతున్నా ఉద్యోగం ఇప్పించలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని నిలదీసిన లక్ష్మయ్యను సురేందర్ బెదిరింపులకు గురిచేయడంతో అతను టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. అప్పటి ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను టూటౌన్ సీఐ ప్రసాద్‌రావు నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ మల్లేశం సమర్పించగా ఏపీవో నహేద పర్హీన్ వాదనలు వినిపించారు. జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించి సురేందర్‌కు 3 ఏళ్ల జైలు, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


