రామగుండం: తెలంగాణలో నూతనంగా ప్రత్యేక రైళ్ల కేటాయింపులపై మే 10న హైదరాబాద్ పర్యటనకు విచ్చేయనున్న ప్రధాన మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణిందర్ తెలిపారు.
● ఉమ్మడి రాష్ట్ర హయాంలో తిరుపతి–న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ సంపర్క్ క్రాంతి రైలు తరహాలోనే తెలంగాణ సంపర్క్ క్రాంతి పేరుతో ప్రత్యేక రైలు నడిపించాలి. దీనిని హైదరాబాద్–యోగానగరి రిషికేశ్ మధ్య నడిపిస్తే పుణ్యక్షేత్రాలు పర్యటించే యాత్రికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.
● నందిగ్రామ్ (రైలు నం.11001/02) ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేట జంక్షన్ వరకు పొడగించాలని, ఈ రైలు ముంబాయి–బల్హర్షా మధ్య వారాంతపు (వీక్లీ) ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తుండగా రోజూ నడిపించాలి. ఈ రైలు ముంబాయిలో బయలుదేరి నాసిక్, షిర్డీ, మన్మాడ్, కేబీ ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి మీదుగా కాజీపేట వరకు నడిపించాల్సిన అవసరం ఉంది.
● హైదరాబాద్–షాలిమార్ (కోల్‌కత్తా) వయా బల్హర్షా మీదుగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపించాలి. ఈ రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, పెద్దపల్లి, నగ్‌భీర్, రాయ్‌పూర్, గోండియా, బిలాస్‌పూర్, ఝార్సీగూడ, రూర్కెలా, ఖరగ్‌పూర్, టాటానగర్ మీదుగా కోల్‌కతా (షాలీమార్) చేరుకుంటుంది. ఈ రైలు నడిపిస్తే కాగజ్‌నగర్, పెద్దపల్లి, బసంత్‌నగర్, హైదరాబాద్‌లోని ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కార్మికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వీటన్నింటిపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో ఇప్పటికే చర్చించడం జరిగిందని, వీరి సహకారంతో ఫోరం ప్రతినిధుల బృందం ప్రధాని మోదీని కలిసి నూతన రైళ్లను ప్రవేశపెట్టాలని కోరనున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నాడు.
ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధుల డిమాండ్


