కరీంనగర్‌అర్బన్/కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌కల్చరల్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాసవీ మాత చిత్రపటానికి కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్యవైశ్య ప్రతినిధులు నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్య వైశ్యులు సమాజంలో వివిధ రకాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంతో పాటు వైశ్య భవనం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో కె.మహేశ్వర్, కార్పొరేటర్లు వంగాల పవన్‌కుమార్, కొలిపాక రమ్య శ్రీనివాస్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కన్న కృష్ణ, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, సంఘం నాయకులు చిదుర సురేశ్, కటకం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
డంప్‌యార్డ్ పరిష్కార బాధ్యత లేదా?
కరీంనగర్‌కార్పొరేషన్: డంప్‌యార్డ్ సమస్యను పరిష్కరించే బాధ్యత కేంద్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌కి లేదా అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. డంప్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌ను తీసుకువచ్చి చేసిన హడావుడి మరిచిపోయావా అంటూ నిలదీశారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడారు. హుజురాబాద్‌తో పాటు కరీంనగర్‌కు కూడా సంజయ్ ఎంపీగా ఉన్నారని, నగరపాలకసంస్థలో బీజేపీయే అధికారంలో ఉందని తెలిపారు. అప్పుడేమో డంప్‌యార్డ్ పరిష్కారం అయిపోతుందని భ్రమలు కల్పించి, ఇప్పుడేమో హుజురాబాద్‌లో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు జంతుకళేబరాలు వేస్తానంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని మరోసారి కరీంనగర్ కో ఆప్షన్ ఎన్నికల్లో రుజువైందన్నారు. హుజురాబాద్‌లోనూ డంప్‌యార్డ్ పేరిట రెండు పార్టీలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రిగా డంప్‌యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా సహకారం అందిస్తామని, అలా కాకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌రెడ్డి, నాయకులు ఎండీ తాజ్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, దండి రవీందర్, ఇట్టెపు వేణు, మ్యాకల నర్సయ్య, జీడి రమేశ్, వంగల విద్యాసాగర్, నాగుల సతీశ్, హనీఫ్, ఉప్పరి అజయ్, ఖలీల్ పాల్గొన్నారు.
ఏబీవీపీ దీక్ష విరమణ
కరీంనగర్/కరీంనగర్‌టౌన్: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రభుత్వ యత్నాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్ష ఆదివారం విరమించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు మంగు నరసింహాద్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏటా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, దీనికోసం కేవలం రూ.2,500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం తగిన నివేదిక సమర్పించి, పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరిబాబు మద్దతు తెలిపారు. అనంతరం దీక్షను విరమింపజేశారు. జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, ఎస్‌ఎఫ్‌డీ రాష్ట్ర కోకన్వీనర్ అజయ్, రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ నందు, నగర కార్యదర్శి యోగేశ్, మురళి, నాగరాజు, వంశీ, శివ, మనోజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


