కొత్త విధానంలో కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

కొత్త విధానంలో కొనుగోళ్లు

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ ఆదేశాలు

కొన్న వెంటనే ఆన్‌లైన్‌ ట్రక్‌షీట్‌ జారీ

జీపీఎస్‌ వాహనాల్లో మిల్లులకు రవాణా

నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభం

కరీంనగర్‌రూరల్‌: యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ రోజు ధాన్యం లోడ్‌ చేస్తే అదేరోజు రైతు, ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత మాన్యువల్‌ ట్రక్‌షీట్‌తో రైస్‌ మిల్లులకు పంపించారు. అనంతరం సొసైటీ, ఐకేపీ సిబ్బంది ట్రక్‌షీట్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినపుడు రైతుకు ఓటీపీ వచ్చేది. కాగా, కొత్త విధానంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యమేర్పడే అవకాశముందని కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.

నేటి నుంచి కొనుగోళ్లు

జిల్లాలో యాసంగి సీజన్‌లో 2.73లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 6.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.ఽ ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో మొత్తం 318 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు సుమారు 205 కేంద్రాలను ఎమ్మెల్యేలు, అధికారులు లాంఛనంగా ప్రారంభించగా సోమవారం నుంచి ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం ప్రస్తుత యాసంగి సీజన్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లలో అమలు చేయనున్న కొత్త విధానం ఆందోళన కలిగిస్తోంది. కొత్త విధానం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే రైతుకు ఓటీపీ వస్తోంది. అనంతరం ఆన్‌లైన్‌ ట్రక్‌షీట్‌ జారీ చేయడం ద్వారా ధాన్యం, రైసుమిల్లు వివరాలు రైతు తెలుసుకునే అవకాశముంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో చూపించిన రైసుమిల్లుకు మాత్రమే జీపీఎస్‌ ఉన్న ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం లోడ్‌ పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రాలకు ఒక్కటే ట్యాబ్‌ ఇవ్వడంతో ఏ రోజు ధాన్యం లోడ్‌ చేస్తే అదే రోజు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యమేర్పడే అవకాశముందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి చేపట్టనున్న ధాన్యం కొనుగోళ్లతో క్షేత్రస్థాయిలో కొత్త విధానంలో నెలకొన్న సమస్యలను గుర్తించే అవకాశముందని కరీంనగర్‌ సొసైటీ కార్యదర్శి రమేశ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement