మే 10వరకు ఎవరికి వారే నమోదుకు అవకాశం సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1855 కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్‌అర్బన్: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను స్వయంగా నమోదు (స్వీయ గణన) చేసుకోవాలని కలెక్టర్ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌లో మాట్లాడారు. స్వీయ గణన ఈ నెల 26 నుంచి మే 10వరకు కొనసాగుతుందన్నారు. జన గణనలో గృహ నివాసయోగ్య స్థితి, వసతులు, కుటుంబ యజమాని పేరు తదితర వివరాలతో కూడిన 34 రకాల ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఈ సమాచారం దేశ ప్రగతికి దోహదపడుతుందన్నారు. http:// se. census. gov. in పోర్టల్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి గృహాన్ని జియోట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. తర్వాత హెచ్‌తో ప్రారంభమయ్యే 11అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ జనరేట్ అవుతుందని, ప్రజలు తమ కుటుంబ వివరాలను సుమారు 15 నిమిషాల్లో నమోదు చేసి ఈ ప్రత్యేకమైన సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఐడీ పొందవచ్చన్నారు. ఇళ్ల గణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు ఐడీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
తొలిదశ మే 11 నుంచి
జనాభా గణన తొలిదశ మే 11నుంచి జూన్ 10వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రెండో దశ 2027 ఫిబ్రవరి 9నుంచి 25వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉంటుందని, స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనాలని సూచించారు. స్వీయ గణన సందర్భంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1855కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని 16 మండలాలు, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1,227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించామని, ఇందులో 1,234 మంది ఎన్యుమరేటర్లు, 215 మంది సూపర్వైజర్లు పాల్గొంటారని తెలిపారు. కరీంనగర్ బల్దియాలో 666 బ్లాకులుగా విభజించగా 733 ఎన్యుమరేటర్లు, 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో కే.మహేశ్వర్, జిల్లా ప్రణాళిక అధికారి రామ్‌దత్తారెడ్డి, ఎస్‌వో కిషన్ రావు, జిల్లా సెన్సెస్ ఇన్‌చార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్వీయ గణన
జనగణనలో భాగంగా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదివారం స్వీయ గణన వివరాలు స్వయంగా నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ పౌరుడు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని కచ్చితమైన సమాచారం అందించి జనగణన సిబ్బందికి సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి రామ్‌దత్తారెడ్డి తమ వివరాలు నమోదు చేసుకున్నారు.


