వ్యవ‘సాయం’లో ఆధునిక యంత్రం.. | - | Sakshi
Sakshi News home page

వ్యవ‘సాయం’లో ఆధునిక యంత్రం..

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ఆధునిక యంత్రాలు వస్తుండటంతో రైతులు కూలీల కొరతను అధిగమించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేయడంతో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసి ఆదాయం పొందుతున్నారు. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి కోత నుంచి అమ్మకం వరకు ఆధునిక యంత్రాలను వాడటం, ఐకేపీ, సింగిల్‌ విండో కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే వరి ధాన్యం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు కలిసి వస్తోంది.

కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో సులువుగా కోతలు

ఒకప్పుడు వరి కోతలు వచ్చాయంటే రైతులు భయపడే పరిస్థితి. కూలీలు దొరికేవారు కారు. కూలీలు దొరికినా రూ.300 ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పొలాలు కోసేందుకు కంబైన్డ్‌ హార్వెస్టర్లు రావడంతో వరి కోతలు సులువుగా మారాయి. టైర్‌ హార్వెస్టర్‌ అయితే గంటకు రూ.1800 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నారు. గంటకు ఎకరం వరకు కోస్తారు. కంబైన్డ్‌ హార్వెస్టర్‌లో ఫ్యాన్‌ ఉండటంతో తూర్పార పట్టే అవకాశం లేకుండా పోయింది. గింజపూర్తిగా ఎండిన తర్వాత తేమ లేకుండా హార్వెస్టర్‌తో కోయిస్తున్నారు. రైతులు నేరుగా హార్వెస్టర్‌ నుంచే గ్రామాల్లోని ఐకేపీ కేంద్రానికి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అలాగే భూమి తేమగా ఉన్న వరి పొలాలను కోయించేందుకు చైన్‌ హార్వెస్టర్లను ఉపయోగిస్తున్నారు. దీని ఖర్చు గంటకు రూ.3వేల నుంచి రూ.4వేలు వసూలు చేస్తున్నారు. ఎకరం పొలం కోయాలంటే గంటన్నర పడుతుంది. హార్వెస్టర్‌తో వరి కోయించడం వల్ల రైతుకు కనీసం రూ.4వేల నుంచి రూ.5 వేలు ఆదా అవుతాయి.

పశుగ్రాసం సేకరణ మరింత సులభం

హార్వెస్టర్‌తో వరి పొలాలు కోయిస్తే గడ్డి పొలం అంతా పడుతుంది. గడ్డిని మోపులు కట్టి తరలించడం రైతులకు కష్టంగా మారడంతో రైతులు పొలాల్లోనే వరి గడ్డిని తగలబెడుతున్నారు. దీనివల్ల చాలాచోట్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరిగడ్డిని కట్టలు కట్టే యంత్రాలు(బేలర్‌ మిషన్‌) వచ్చాయి. ఈ మిషన్‌ పొలంలో ముక్కలుగా ఉన్న గడ్డిని నిమిషాల వ్యవధిలో పోగు చేసి కట్టలు కడుతుంది. ధీని ధర రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. గ్రామాల్లో బేలర్‌ యంత్రాలు కొని అద్దె ప్రతిపాదికన నడిపిస్తున్నారు. ఎకరం పొలంలో 50 నుంచి 60 గడ్డి కట్టలు అవుతాయి. ఒక్కో కట్టకు రూ.40 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారు. దీనివల్ల తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రైతులకు కలిసి వస్తుంది.

ధాన్యాన్ని తూర్పార పట్టడం మరింత తేలిక

వరి ధాన్యాన్ని అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత కొనుగోలు నిర్వాహకులు ధాన్యంలో తప్ప, తాలు ఉందని కొర్రీలు పెడుతున్నారు. ఇద్దరు చాటలను ఊపుతూ ఉంటే వచ్చే గాలితో మరొకరు ధాన్యాన్ని గాలికి ఎగబోసేవారు. రైతుల శ్రమను తగ్గించేందుకు ధాన్యాన్ని తూర్పార పట్టే యంత్రం అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు ఉంటుంది. దీన్ని 3 హెచ్‌పీ మోటర్‌తో అనుసంధానం చేస్తారు. ఇందులో ఫ్యాన్లు ఉంటాయి. ధాన్యం కుప్ప వద్ద ఈ యంత్రాన్ని పెట్టి అందులోఽ ధాన్యం పోయగానే శుభ్రం చేస్తుంది. తర్వాత కూలీలతో సంచులు నేరుగా నింపి, తూకం వేయవచ్చు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తూర్పార పట్టే మిషన్లను ఒక్కటి రెండు చొప్పున అందుబాటులో ఉంచుతున్నారు.

కూలీల కొరతను అధిగమిస్తున్న రైతులు

కోత నుంచి పంట అమ్మే వరకు యంత్రాల వినియోగం

Advertisement
 
Advertisement
Advertisement