రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

ధర్మారం: ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని దుర్గామాత గుడి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన సంగ మల్లవ్వ అలియాస్‌ కత్తరవ్వ (58) అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగ మల్లవ్వ తన కుమారుడు కుమార్‌తో కలిసి ఎండపల్లి నుంచి పెగడపల్లి మండలం కీచులాటపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. ప్రవీణ్‌తో పాటు మరో యువకుడు కరీంనగర్‌ నుంచి మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి ఉన్న విద్యుత్‌ వైరు మోటారు సైకిల్‌కు చుట్టుకోవడంతో రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మల్లమ్మ తలకు తీవ్రగాయాలు కాగా ప్రవీణ్‌ కాలు ప్రాక్చర్‌ అయింది. వీరిద్దరిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మల్లమ్మ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన దర్జీ తెంబరవేణి శ్యామ్‌(57) ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసికొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్యామ్‌ ఆర్థిక పరిస్థితి సరిగా లేక అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, కూతురు హరిప్రియ ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు శ్యామ్‌ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ధర్మపురిలో చోరీ

ధర్మపురి: పట్టణంలోని హన్మాన్‌వాడకు చెందిన రాపర్తి ప్రభాకర్‌ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రభాకర్‌ ఈనెల 24న హైదరాబాద్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఆదివారం ప్రభాకర్‌ బంధువులు వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. వెంటనే ప్రభాకర్‌కు సమాచారం అందించారు. ఇంటికి చేరుకుని చూడగా బీరువాలో ఉన్న పావు తులం బంగారం, జతకమ్మలు, 17 తులాల వెండి వస్తువులు, రూ.4500 ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎస్సై మహేష్‌తోపాటు సిబ్బంది చేరుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement