ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని శ్మశానవాటికలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పోచమ్మ విగ్రహాలను కొందరు నాలుగైదు రోజుల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. అన్ని కుల సంఘాల పక్షాన స్థలాలు ఉన్నాయని తమకు కూడా స్థలం ఉండాలని ఓ వర్గం భావించి సదరు స్థలంలో పోచమ్మ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్తులు ఈ విషయంపై నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ సుజాతకు ఫిర్యాదు చేశారు. వెంకటాపూర్‌లో ప్రధాన రహదారిని ఆనుకుని సర్వే నంబర్ 494లో 13 గుంటలు పరంపోగు భూమి శ్మశానవాటిక పేరిట 2006లో రిజిస్ట్రేషన్ అయ్యింది. సదరు భూమిని గ్రామస్తులు 396 సర్వేనంబర్‌లోని స్థలంలో శ్మశానవాటికను ఏర్పాటు చేసి 494లో ఉన్న స్థలంలో స్నానాలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అది గ్రామస్తులకు చెందిన స్థలమని ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్‌ఐ శ్రావన్ శనివారం విగ్రహాలు ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. పరంపోగు భూమి అని, శ్మశానవాటిక ఉన్నట్లు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను అనుమతులు లేకుండా పెట్టిన వ్యక్తులపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహాలు పెట్టిన వ్యక్తులు తొలగించకపోతే తామే తొలగిస్తామని తహసీల్దార్ సుజాత తెలిపారు. వారు తొలగించకపోవడంతో ఆదివారం జేసీబీ సహాయంతో రెవెన్యూ అధికారులు తొలగించారు.
గ్రామస్తుల అభ్యంతరం
రెవెన్యూ అధికారుల పరిశీలన
జేసీబీతో తొలగింపు


