ఇల్లంతకుంట/చందుర్తి: పిల్లల మానసిక వికాసమే లక్ష్యంగా విద్యార్థి కేంద్రీకృత బోధన కొనసాగుతోందని ఉపాధ్యాయుడు మహేశ్‌చంద్ర తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హైస్కూల్‌లో పనిచేసే ఉడుత మహేశ్‌చంద్ర ఈనెల 20 నుంచి 25 వరకు ఫిన్లాండ్ దేశంలో బోధనపై అధ్యయనానికి వెళ్లారు. ఈనెల 26న తిరిగి వచ్చారు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, టీచర్ ట్రైనింగ్ స్కూల్, ఒకేషనల్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్‌ను సందర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి ప్రొఫెసర్లతో పలు అంశాలపై చర్చించారు. బోధన పద్ధతులు, బోధకుల శిక్షణ విధానాలు, పాఠశాల విద్య, వృత్తి శిక్షణ వ్యవస్థలను అధ్యయనం చేశారు. ఆయన మాట్లాడుతూ ఫిన్లాండ్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులకు అపార గౌరవం ఉంటుందన్నారు. ఈ ఎక్స్పోజర్ విజిట్ ద్వారా పొందిన అనుభవాన్ని మన ప్రాంతంలోని విద్యావ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు తెలిపారు.
శిక్షణ సర్టిఫికెట్లు
ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ బృందానికి అక్కడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 40 మంది ఉపాధ్యాయులు వెళ్లగా.. ఆ బృందంలో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఇల్లంతకుంటలో పనిచేసే మహేశ్‌చంద్ర, చందుర్తి మండలం తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని రామగిరి స్వరాజ్యలక్ష్మి వెళ్లిన వారిలో ఉన్నారు.
ఉపాధ్యాయుడు మహేశ్‌చంద్ర
ముగిసిన ఫిన్లాండ్ యాత్ర


