15 రోజులుగా..
సిరిసిల్లఅర్బన్/కోనరావుపేట: రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అంతకన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది. యాసంగి సాగులో చేతికొచ్చిన పంటను కోసిన రైతులు కేంద్రాలకు ఇప్పటికే తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ తూకం వేయడం లేదు. ఫలితంగా చాలా మంది రైతులు పది రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.
విలీన గ్రామాల్లో విలాపమే..
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలు సర్దాపూర్, పెద్దూరు, బోనాల, చంద్రంపేట, రగుడులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ తూకం వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యంతో కళకళలాడుతున్నాయి. ధాన్యం ఆరబోసి 10 నుంచి 15 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు లేకపోవడంతో కేంద్రాల్లోనే రైతులు ఉంటున్నారు. ఎండలు తీవ్రంగా కొడుతుండడంతో 17 శాతం తేమ కంటే మరింత పడిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భయపెడుతున్న వాతావరణం
వాతావరణంలో కలుగుతున్న మార్పులతో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు వడ్లు తడిసిపోయాయి. ఇటీవల ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, తంగళ్లపల్లి మండలాలతోపాటు సిరిసిల్ల శివారు గ్రామాల్లో వడగండ్లు కురిశాయి. వడ్లు తడిసిపోవడంతో రైతులు మళ్లీ ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. కోనరావుపేట మండలం మరిమడ్లలో 10 రోజుల్లోనే రెండు సార్లు కురిసిన వడగండ్లతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది.
కోనరావుపేటలో అధ్వానం
కోనరావుపేట మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు తూకాలు వేయలేదు. మండలంలోని కొలనూర్ సింగిల్‌విండో పరిధిలో 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 600 బస్తాలు మాత్రతే కొనుగోలు చేశారు. గతేడాది ఈ సమయానికి 60 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 15 సెంటర్లు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 320 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతేడాది సుమారు 20 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కోనరావుపేట సింగిల్‌విండోలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది ఈ సమయానికి 18 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈసారి 300 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు.
నేను ఐదు ఎకరాల్లో వరిపంట వేసిన. 15 రోజుల క్రితం పంట కోసి కేంద్రానికి ధాన్యం తెచ్చిన. అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయి. ప్రస్తుతం 17 శాతం తేమ వచ్చి వారం అవుతోంది. ఇప్పటి వరకు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు.
– గంగుల బాలయ్య, పెద్దూరు


