అధికార పార్టీలో పదవుల పండుగ | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలో పదవుల పండుగ

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

● నామినేటెడ్‌ పద్ధతిలో ప్యాక్స్‌ పాలకవర్గాలు ● కేడీసీసీబీ పరిధిలో వందల మందికి అవకాశం

కరీంనగర్‌ అర్బన్‌: అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ వచ్చినట్లే. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు లేవని తేలిపోగా, ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్‌ పోస్టులు దక్కనున్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల తరహాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) పాలక మండళ్ల నియామకానికి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైన విషయం తెలిసిందే. పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. సహకార సంఘాలకు పాలకమండళ్లు ఏర్పాటుచేశాక జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (డీసీఎంఎస్‌)లకు కూడా ఇదే తరహాలో పాలకవర్గాలు ఏర్పాటు చేయనున్నారు.

మొదలైన పైరవీలు

ప్రభుత్వం నామినేటెడ్‌గా పీఏసీఎస్‌లను నియమించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాలకవర్గాన్ని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. మొత్తం 131 పీఏసీఎస్‌లుండగా సుమారు 1,703 మంది డైరెక్టర్లు అయ్యే అవకాశముంది. 131 చైర్మన్‌, 131 వైస్‌ చైర్మన్‌ పదవులు వరించనున్నాయి. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు పైరవీలపై దృష్టిసారిస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లలోనూ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులతోపాటు డైరెక్టర్‌ పదవులు ఉంటాయి. అధికార పక్షం ప్రజాప్రతినిధులు ఆయా పదవులకు అభ్యర్థులను ప్రతిపాదించే అవకాశం ఉండటంతో నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2025 ఫిబ్రవరిలోనే పీఏసీఎస్‌ల పాలక మండళ్ల పదవీకాలం పూర్తయింది. ప్రభుత్వం వీటిపై మార్గదర్శకాలను విడుదల చేసి త్వరలోనే నియామక ప్రక్రియ మొదలు పెట్టే అవకాశముంది.

కేడీసీసీబీ పరిధిలో 131 పీఏసీఎస్‌(ప్యాక్స్‌)లు

కరీంనగర్‌ డీసీసీబీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉండగా 131 ప్యాక్స్‌లు ఉన్నాయి. సుమారు 10.5లక్షల మంది రైతులకు సభ్యత్వాలున్నాయి. వీరు తొలుత డైరెక్టర్లను ఓటింగ్‌ ద్వారా ఎన్నుకొనేవారు. ఇలా ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లుంటారు. వీరి మద్దతుతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు నియమితులయ్యేవారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇక వీరంతా నామినేటెడ్‌ పద్ధతిలోనే భర్తీ కానున్నారు. ఎన్నికై న పీఏసీఎస్‌ చైర్మన్లు డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలక మండళ్లను ఎన్నుకుంటారు. వీటిని నామినేటెడ్‌ విధానంలోనే నియమించే అవకాశం ఉంది.

ప్యాక్స్‌ల సంఖ్య పెరగనుందా?

రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్యాక్స్‌ల సంఖ్య పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కేడీసీసీబీ కూడ ప్రతిపాదనలు పంపింది. సుమారు 20కి పైగా సంఖ్య పెరగనుండగా రాజకీయ ఉపాధి మరింత పెరగనుంది. ప్రభుత్వం కూడా ఇదివరకు ప్రతిపాదనలు తీసుకోగా ఒక్కో మండలంలో రెండు ప్యాక్స్‌లు కూడా ఉన్నాయి. కొన్ని మండలాల్లో ఒకటే ఉంది. స్థానిక అవసరాలు, రైతుల సేవలకు అనుగుణంగా సంఖ్య పెరగవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement