బోగస్‌ బిల్లులు! | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ బిల్లులు!

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

● జాడలేని ఫ్లెక్సీ ప్రింటర్‌ షాపు ● ప్రజాపాలన సాకుతో అడ్డగోలు దందా అవినీతికి తావు లేదు

ఇటీవల ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన 2 కే రన్‌ నిర్వహణలో వాడిన టీషర్డులు, టోపీలకు రూ.70 వేలు ఖర్చు చేశారు. వీటి కొనుగోలు ప్రింటింగ్‌ కోసం కోరుట్లలో లేని ఫ్లెక్సీ ప్రింటర్‌ షాపు పేరిట బిల్లు పెట్టారు. బిల్లులో చూపిన ‘మౌనిక ఫ్లెక్సీ ప్రింటర్‌’ షాపు ఎక్కడుందని ఎవరిని ఆరా తీసినా ఏమో తెలియదు.. అనే జవాబు వస్తుండడం గమనార్హం. ఇంతకీ షాపు ఉందో లేదో..సదరు అధికారులే చెప్పాలి.

కోరుట్ల మున్సిపాల్టీలో ప్రతినెలా వివిధ విభా గాల్లో వాడుతున్న వాహనాలకు డీజిల్‌ ఖర్చులు ఎంత తక్కువ అనుకున్నా రూ.4 నుంచి రూ.6లక్షల వరకు చూపుతున్నారు. వాస్తవానికి ఈ బిల్లులు రూ. 4 లక్షలకు మించవని సమాచారం. బంకు నిర్వాహకుల వద్ద ఖాళీ రశీదులు తీసుకుని వాటిలో బిల్లులు రాసి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవీ.. కోరుట్ల మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి తంతుకు నిదర్శనం. మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో ఎంతో కొంత మిగుల్చుకోవాలన్న ధ్యాసతో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విచారకరం.

కోరుట్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సాకుగా కొంత మంది కోరుట్ల మున్సిపల్‌ అధికారులు అవినీతికి తెరతీశారు. ప్రజాపాలనలో భాగంగా 20 రోజుల క్రితం నిర్వహించిన 2కె రన్‌ కోసం టీషర్టులు, టోపీలు కొనుగోలుతో పాటు ప్రింటింగ్‌ ఖర్చుల కోసం రూ.70వేలు బిల్లు పెట్టారు. కేవలం 50 మంది హాజరు కాని ఈ 2కే రన్‌కు అదనంగా బిల్లులు పెట్టారని కొంతమంది మున్సిపల్‌ కౌన్సిలర్లు ఆ సమయంలోనే ఆరోపించారు. ఆ బిల్లు స్థానికంగా ఎక్కడా లేని మౌనిక ఫ్లెక్సీ ప్రింటర్స్‌ పేరిట చూపడం గమనార్హం. దీనికి స్థానికంగా ఉన్న ఓ ఫ్లెక్సీ ప్రింటర్‌ వారు కోట్‌ చేసినట్లు రెండింటిలో మౌనిక ఫ్లెక్సీ ప్రింటర్స్‌ ధర తక్కువగా ఉందని.. ఆ షాపు వారికి ఆర్డర్‌ ఖరారు అయినట్లు ఓ బిల్లు జత చేసి చూపారు. ఆ షాపు ఎక్కడుందో..? దానికి ట్రేడ్‌ లైసెన్స్‌ జత చేశారా..? అన్న విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు.

నెలకు రూ.లక్షన్నర హాంఫట్‌..!?

కోరుట్ల మున్సిపాలిటీలో చెత్త తరలింపు, పారిశుధ్యం నిర్వహణ, జేసీబీలు, అధికారులు వాడుతున్న కార్లకు ప్రతినెలా ఎంత తక్కువ అనుకున్నా రూ.4లక్షల నుంచి రూ.6లక్షల బిల్లు చూపుతున్నట్లు సమాచారం. వాస్తవంగా వాడుతున్న డీజిల్‌ బిల్లుకు అదనంగా రూ.లక్షన్నర వరకు బోగస్‌ బిల్లులు పెడుతున్నట్లు సమాచారం. పట్టణంలోని ఓ బంక్‌ నిర్వాహకుల నుంచి మున్సిపల్‌ సిబ్బందికి కొన్ని ఖాళీ రశీదులు తీసుకుని అదనంగా బిల్లులు సృష్టిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ప్రతినెలా రూ.లక్షన్నర అదనపు బిల్లులు జత చేసి కాజేస్తున్నట్లు సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో కింది స్థాయి సిబ్బంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పైస్థాయి అధికారుల ఒత్తిడితో డీజిల్‌ బిల్లుల పేరిట ఎంతో కొంత పక్కన వేసుకునే తంతు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం.

మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి తావు లేకుండా పనులు చేపడుతున్నాం. అవకతవకలు జరిగినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో విచారించి తగిన రీతిలో అవసరమైన చర్యలు తీసుకుంటాం.

– రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కోరుట్ల

Advertisement
 
Advertisement
Advertisement