గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులకు బీమాపై ధీమా కల్పించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. సంస్థపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు అత్యధిక బ్యాంకు ఖాతాలు ఉన్న ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకుంది. సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 23న సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీఐ అధికారులతో ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు ప్రమాదాల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించే బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22 నుంచి ప్రమాద బీమా పథకం అమలవుతోంది.
50 మందికి రూ.30కోట్ల చెల్లింపు
ఎస్‌బీఐ ప్రమాద బీమా సింగరేణి ఉద్యోగులను ఆదుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన పలు ప్రమాదాల్లో మృతి చెందిన 50 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ. 30కోట్ల ప్రమాద బీమా సొమ్ము చెల్లించింది.
ఆరోగ్య బీమా కూడా..
కార్పొరేట్ సాలరీ ఖాతా కలిగిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే భార్యాభర్తలతోపాటు ఇద్దరు పిల్లలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ఎస్‌బీఐ అందిస్తోంది. సాధారణ ఆరోగ్య బీమా ప్రీమియంతో పోల్చితే తక్కువ ఇన్‌స్టాల్‌మెంట్‌తో కార్పొరేట్ సాలరీ ఖాతాదారులకు అందిస్తోంది. రూ.కోటి ప్రమాద బీమాతో పాటు పాక్షిక అంగవైకల్యం, సంపూర్ణ అంగవైకల్యానికి కూడా నిబంధనల ప్రకారం రూ.కోటి బీమా సొమ్ము చెల్లిస్తోంది.
రిటైర్డ్ కార్మికులకు రూ.30లక్షలు
రిటైర్డ్ కార్మికులకు కూడా రూ.30 లక్షల ప్రమాద బీమా పథకాన్ని 70ఏళ్ల వరకు అందిస్తోంది. మృతుడి కుటుంబంలోని పిల్లలు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవారు చదువుతూ ఉంటే అబ్బాయి అయితే రూ.8లక్షలు, అమ్మాయి అయితే రూ.10 లక్షలు చదువు కొనసాగించడానికి బ్యాంకు చెల్లిస్తోంది. వివాహ వయసు కలిగిన పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు చొప్పున గరిష్టంగా ఇద్దరికి కలిపి రూ.10 లక్షల వరకు చెల్లిస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే రూ.5లక్షల చెల్లిస్తామని, తమ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని, ఇంకా అనేక సౌకర్యాలు ఈ ఒప్పందంలో పొందుపరిచామని సింగరేణి ఉన్నతాధికారులు వెల్లడించారు.
సింగరేణి ఉద్యోగులకు బీమా సౌకర్యం
ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్న యాజమాన్యం


