నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
కరీంనగర్‌టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి జంబ్లింగ్ విధానం అమలు చేయడం లేదు. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఈనెల 2 నుంచి 6, రెండో విడతలో ఈనెల 7 నుంచి 11 వరకు పరీక్షలు జరుగుతాయి. 50 కేంద్రాల్లో జనరల్ (బైపీసీ, ఎంపీసీ) విద్యార్థులకు పరీక్షలు జరగనుండగా, 10 కేంద్రాలను ఒకేషనల్ విద్యార్థులకు ఏర్పాటు చేశారు.
చదివిన కళాశాలలోనే..
ఈసారి జనరల్ విద్యార్థులకు సొంత కళాశాలలోనే పరీక్షలు జరగనుండగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా ఎగ్జామినర్ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి ప్రశ్నపత్రాలు డౌన్‌లోడ్ చేయనున్నారు. ఏ విద్యార్థి యే ప్రయోగం చేయాలనేది ఇంటర్ బోర్డు విద్యార్థి హాల్ టికెట్‌నంబర్ ఆధారంగా కేటాయిస్తుంది. పరీక్షల పర్యవేక్షణకు ఒక్కో కేంద్రంలో డిపార్ట్‌మెంటల్ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌కు అనుసంధానం చేశారు.
తనిఖీ బృందాల నియామకం
జిల్లా స్థాయిలో పరీక్షల నిర్వహణకు ఏర్పాటయ్యే హైపవర్ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, సభ్యులుగా సీపీ, మెంబర్ కన్వీనర్‌గా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి వ్యవహరించనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు డెక్ బృందంలో జిల్లా నోడల్ అధికా రి, ఇద్దరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలల ప్రిన్సి పాల్స్, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. కన్వీనర్‌గా డీఐఈవో గంగాధర్, సభ్యులుగా వి.ఆంజనేయరావు, వి.సత్యవర్దన్‌రావు, ఎ.సత్యనారాయణ, అస్మాజాబిన్‌తో కమిటీ ఏర్పాటు చేశారు.
మార్కుల్లో ప్రైవేట్ ముద్ర
చదివిన కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ప్రైవేట్ కాలేజీలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులకు మార్కులు కేటాయించే విషయంలో ఎగ్జామినర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. వారిని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకున్న ఉదంతాలు గతంలో చోటుచేసుకున్నాయి. కాగా, ప్రస్తుతం విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎగ్జామినర్లు మార్కులు వేసేలా అధికారులు నిఘా పెంచనున్నట్లు తెలిసింది.
హాజరయ్యే జనరల్ విద్యార్థులు 14,522
ఒకేషనల్ విద్యార్థులు 2,735
పరీక్ష కేంద్రాల సంఖ్య 60
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11
ఇతర ప్రభుత్వ విభాగంలో 4
ప్రైవేట్ పరిధిలో 45


