బీజేపీ, కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
కరీంనగర్‌టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాగ్దానాలను అమలు చేయకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్శన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాయని, ఆ పార్టీలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ పేరిట నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం తెలంగాణచౌక్‌లో చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సీరియల్ వలె రోజుకో నోటీసు పేరిట కాలం వెలదీస్తూ పాలనను మర్చిపోయారని మండిపడ్డారు. ఒకసారి జూ బ్లీహిల్స్ ఎన్నికల్లో, మరోసారి సర్పంచ్, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో.. ఇలా కేవలం ఎన్నికలప్పుడే నోటీసులు పంపడం.. తద్వారా బీఆర్‌ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉండదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖకు సంబంధించిన అధికారులు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీంలో అప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులే ఉన్నారని, మొదట వారికి నోటీసులు పంపాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు తీస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


