దివ్యాంగులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు అండగా ఉంటాం

Dec 4 2025 8:50 AM | Updated on Dec 4 2025 8:50 AM

దివ్యాంగులకు అండగా ఉంటాం

దివ్యాంగులకు అండగా ఉంటాం

ఉన్నత చదువుకు ప్రోత్సాహం అందిస్తాం

ఐదుశాతం ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ రేకుర్తిలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో బుధవారం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి, దివ్యదృష్టి యూట్యూబ్‌ చానల్‌ ఆవిష్కరించారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందన్నారు. బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులు తమలోని దివ్యదృష్టిని వృథా చేయవద్దని, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఐదుశాతం కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సు పాసుల సమస్య మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగుల శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిత రామచంద్రన్‌ మాట్లాడుతూ.. యూపీఎస్సీ వంటి ఉన్నత ఉద్యోగాల్లో దివ్యాంగులు రాణిస్తున్నారని, చదువును నమ్ముకుని ముందుకు సాగాలని సూచించారు. డైరెక్టర్‌ శైలజ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోపరేటివ్‌ చైర్మన్‌ వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో ఇప్పటికీ స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. సుడా చైర్మన్‌ కె.నరేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపరాణి పాల్గొన్నారు.

అంధ విద్యార్థినితో పాట పాడిన కలెక్టర్‌ పమేలా సత్పతి

కొత్తపల్లి(కరీంనగర్‌): అంధుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి కలెక్టర్‌ పమేలా సత్పతి పాట పాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురష్కరించుకుని పాడిన పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్‌ రచించిన నింగినేల నాదే అనే సినిమా కోసం రాసిన ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత?’ అనే పాటను పాడారు. గతంలో ఓ కార్యక్రమంలో సింధుశ్రీ పాడటం చూసి కలెక్టర్‌ స్ఫూర్తి పొందారు. కరీంనగర్‌ అంధుల పాఠశాల మ్యూజిక్‌ టీచర్‌ సరళ, స్థానిక మ్యూజిక్‌ డైరెక్టర్‌ కేబీశర్మ ఆధ్వర్యంలో కలెక్టర్‌ పాడిన పాటను రికార్డు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement