● పక్షం రోజులుగా మండుతున్న ధరలు ● ఏదికొన్నా కిలోకు రూ.5
బుధవారం నాటి కూరగాయల ధరలు(కిలోకు రూ.ల్లో)
కూరగాయలు పిరం
కరీంనగర్ అర్బన్: వండకముందే కూరల ధరలు కుతకుతమంటుండగా జేబులు తడుముకోవడం వినియోగదారుల వంతవుతోంది. చిక్కుడు ధర కిలో సెంచరీ దాటగా బెండ, తోటకూరది ఇదే పరిస్థితి. టమాట ధర రైతు బజార్లలో కిలో రూ.50 పలుకుతుండగా ఇక చిల్లర మార్కెట్లలో రూ.70కి విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో మరింత అదనం. ఏ కూరగాయ చూసిన ధరల మోతే. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులపై పెనుభారం పడుతోంది.
ఇతర ప్రాంతాలపైనే ఆధారం
జిల్లాలో 11లక్షలకు పైగా జనాభా ఉండగా సాగు విస్తీర్ణం అంతంతే. దీంతో మదనపల్లె, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి టమాట, మిర్చి, ఇతర కూరగాయలను దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ధరలను ఇష్టారీతిగా పెంచేస్తున్నారు. ప్రధానంగా రాయితీ కూరగాయల విత్తనాల పంపిణీ లేకపోవడంతో రైతులు కూరగాయల సాగుకు స్వస్తి పలుకుతున్నారు. గత ఎనిమిదేళ్ల్ల క్రితం వరకు ఆర్‌కేవీవై పథకం కింద 70శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేసేవారు. కొన్నేళ్లుగా రాయితీ విత్తనాల ఊసే లేకపోవడంతో సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గుతోంది. 8సంవత్సరాల క్రితం 9వేల ఎకరాల్లో కూరగాయలు సాగవగా ప్రస్తుతం 2వేల ఎకరాలే.
అంతలోనే ఎంత తేడా
నెలరోజుల క్రితం బహిరంగ మార్కెట్లో టమాట ధర రూ.30 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.70కి చేరింది. బీర గతంలో 40ఉండగా రూ.100కు చేరడం ఆందోళనకర పరిణామం. కొత్తిమీర రూ. వంద ఉండగా 180 పలుకుతోంది. హెచ్చు కూరగాయలకు ధరలు పెరగగా వారంలో రూ.40–60 పెరగడం విశేషం. కాకర, సోరకాయ అంతే. క్యాలీ ఫ్లవర్, క్యారెట్, గోరుచిక్కుడు, చిక్కుడు, పాలకూర, చుక్కకూర ధరలు సెంచరీ దాటిపోయింది.
పంట రైతుబజారు మార్కెట్లో ధర
టమాట 50 70
పచ్చిమిర్చి 80 100
కాకర 80 100
బీర 90 100
క్యాబేజీ 60 90
వంకాయ 70 80
బెండ 90 100
క్యారెట్ 80 100
గోరుచిక్కుడు 80 100
చిక్కుడు 80 100
దొండకాయ 60 80
సోరకాయ 45 60


