జల్సాల కోసం చోరీలు
కరీంనగర్‌క్రైం: జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. 15 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ.20లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు వివరాలను శనివారం కమిషనరేట్‌లో సీపీ గౌస్ ఆలం వివరించారు. కరీంనగగర్ కట్టరాంపూర్‌కు చెందిన మనుపాటి శేఖర్, చొప్పదండికి చెందిన మనుపాటి సంజీవ్, రామగిరికి చెందిన ఉండాటి మహేశ్, ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌కు చెందిన బోదాసు కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్‌కు చెందిన సాగర్ల రంజిత్ స్నేహితులు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. చొప్పదండి నియోజవర్గంలో కాపర్‌వైర్, కరెంట్‌మోటార్ వైర్లు, పశువులు, పందులు, గొర్రెలు, మేకలను దొంగలించారు. దొంగిలించిన సొమ్మును చొప్పదండికి చెందిన బొడిగె సంపత్‌కు విక్రయించారు. మొత్తం 15 కేసులు నమోదు కాగా రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టారు. శనివారం గుమ్లాపూర్ వద్ద నిందితులను పట్టుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ చేశారు. వారినుంచి బొలెరో వాహనం, మోటర్‌సైకిల్, మూడు క్వింటాళ్ల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. సీఐలు ప్రదీప్, సంజీవ్, ఎస్సైలు నరేశ్‌రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.
● 15కేసుల్లో నిందితులైన ఆరుగురి అరెస్ట్
● రూ.20లక్షల సొత్తు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్‌ఆలం


