
ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెంచాలి
మానకొండూర్: విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం మానకొండూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాలికలు తయారు చేసిన మట్టి గణపతులను పరిశీలించి అభినందించారు. అనంతరం 8వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. అప్పటికే తరగతిలో ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ బోధిస్తుండడంతో ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు. ఎంఈవో మధుసూదనాచారి, హెచ్‌ఎం జ్యోతి ఉన్నారు.