
ఫేక్ అకౌంట్‌తో పరువుకు భంగం కలిగేలా పోస్టులు
మల్లాపూర్: వ్యక్తిగత కక్ష, పాత తగాదాలతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌ను సృష్టించి పెట్టిన పోస్టులతో 2 కుటుంబాల పరువుకు భంగం కలిగేలా చేసిన యువతిని అరెస్టు చేసినట్లు మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. సోమవారం అరెస్టు వివరాలను వెల్లడించారు. రాఘవపేట గ్రామానికి చెందిన ఓ యువతి తన కుటుంబంతో పాత గొడవలున్న 2 కుటుంబాలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. వాళ్ల అమ్మ పేరుతో ఓ సిమ్ కార్డును కొనుగోలు చేసి తన మొబైల్‌లో సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్‌ను సృష్టించింది. ఆ కుటుంబాల్లోని ఓ వివాహితకు, ఆమె భర్తకు మధ్య గొడవలు సృష్టించేందుకు అబద్ధపు, అసభ్యకరమైన పోస్టులను ప్రచారం చేసింది. మరో వ్యక్తిపై కూడా నిరాధారమైన ఆరోపణలతో పోస్టులు పెట్టింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. యువతి వద్ద నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.
రాఘవపేటకు చెందిన యువతి అరెస్టు