
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
జమ్మికుంట: ట్రాక్టర్ బోల్తాపడటంతో డ్రైవర్ మృతి చెందాడు టౌన్ సీఐ ఎస్ రామకృష్ణ తెలిపారు. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన ఒర్సు లింగయ్య(56)సోమవారం పొలం వద్ద నాటు వేయడానికి కూలీలను దింపి చెరువు కట్టపై నుంచి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిందని, మృతుడి కుమారుడు రాజ్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మోతె మాలవాడకట్టుకు చెందిన అనిల్ నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. దీంతో అనిల్ కుటుంబ సభ్యులంతా క్రైస్తవ మతస్తులు. అనిల్ ఎప్పుడూ ప్రార్థనలకు రాలేదని, క్రైస్తవమత లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు మొదట చర్చి ఫాదర్స్ నిరాకరించారు. దీంతో పలువురు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు చర్చి ఫాదర్స్ దిగివచ్చి ప్రార్థనల అనంతరం అనిల్ అంత్యక్రియలు క్రైస్తవ లాంచనాలతో నిర్వహించారు. దీంతో అనిల్ అంత్యక్రియలకు సుమారు 2, 3 గంటల పాటు ఉత్కంఠ నెలకొంది.
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని రాయికల్‌లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన బాలుడు చేరాల హర్షిత్‌నందన్(18 నెలలు) మృతదేహం సోమవారం లభ్యమైంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. రాయికల్‌కు చెందిన చేరాల వెంకటయ్య–కావ్య కుమారుడు హర్షిత్‌నందన్. ఆదివారం తల్లితో పాటు పొలం వద్దకు వెళ్లి, ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డాడు. బావిలో నీటిని మోటార్లతో తోడేయగా మృతదేహం లభ్యమైంది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండల కేంద్రం శివారులో సోమవారం రాత్రి బొలెరో వాహనం ఢీకొని ఒకరు మరణించారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు. మండలంలోని ఇందిరమ్మకాలనీ గ్రామం సారంపల్లి ప్లాట్స్‌లో నివసిస్తున్న కొంగరి నరేశ్(35) డీసీఎం వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తంగళ్లపల్లిలో బంధువుల అమ్మాయి సహస్ర డెంగీతో చనిపోగా అంత్యక్రియలకు హాజరయ్యాడు. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో నరేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య పల్లవి, రెండో తరగతి, నర్సరీ చదివే ఇద్దరు కొడుకులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..
కొత్తపల్లి(కరీంనగర్): గంగాధర మండలం గోపాల్‌రావుపల్లి గ్రామానికి చెందిన పాతరవేని కొమురయ్య(73) రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో బిల్లా కోటేశ్వర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొమురయ్య, బొడ్డు నాంపల్లి సోమవారం కరీంనగర్‌కు వస్తుండగా.. మార్గమధ్యలో కొత్తపల్లి శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రహదారిపై స్కూటీపై వెళ్తున్న మహిళ సడన్‌గా బ్రేక్ వేసంది. వెనకాల మరో స్కూటీపై ఉన్న మహిళ పక్కకు తిప్పగా.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొమురయ్య, నాంపల్లి తగిలి కింద పడ్డారు. కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ కొమురయ్య మృతిచెందగా.. ద్విచక్ర వాహనం నడిపిన నాంపల్లికి గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి