
15 తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గడాల రంబాబు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ. శుక్రవారం తన భార్య పావనితో కలిసి కరీంనగర్‌లోని అత్తగారింటికి వెళ్లారు. ఆయన తల్లి గడాల లక్ష్మి తన కూతురు సుమలత అనారోగ్యంతో బాధపడుతోందని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు శనివారం వెళ్లింది. సోమవారం సాయంత్రం లక్ష్మి తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 15 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. మంథని సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై దివ్య తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం