కామారెడ్డి రూరల్: పొలం పనులు చేస్తున్న ఓ రైతును పాము కాటు వేయడంతో మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుబ్బాక చిన్న పోచయ్య(50) శుక్రవారం తన పొలంలో పనులు చేస్తుండగా పాటు కాటు వేసింది. విషయం గమనించిన కుటుంబీకులు వెంటనే అతన్ని చికిత్స కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డిచ్‌పల్లి: చెరువులో స్నానం కోసం వెళ్లిన వృద్ధుడు నీట మునిగి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై మ హమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాజున గంగాధర్(60) గ్రామ సమీపంలో ఉన్న కోనం చెరువులో స్నానం చేసేందుకని గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఉదయం పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం బయటకు తేలింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
వేల్పూర్(మెండోరా): మెండోరా మండలం పోచంపాడ్‌లో ఉన్న గోదావరి నది శ్మశాన వాటికి దగ్గర శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659864, 8712659763 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.


