నియోజకవర్గం పరిధిలో ఆయకట్టు (ఎకరాల్లో..)
బాన్సువాడ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు పెరగడంతోపాటు చెత్తచెదారం, పూడిక పేరుకుపోయింది. సుమారు దశాబ్దకాలంగా మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది. దీంతో ఉపకాలువలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో డి–8 నుంచి డి–39 వరకు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. గుర్రపుడెక్క వ్యాపించింది. వేసవిలోనే కాలువల్లోని పిచ్చి మొక్కలను తొలగించాల్సి ఉన్నా సిబ్బంది కొరతతో పనులు చేయడం లేదు. కాలువ కట్టలు సైతం బలహీనంగా మారాయి. పలుచోట్ల కోతకు గురై ఎక్కడ గండి పడుతోందోనని రైతులు భయపడుతున్నారు. కాలువలకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
కాలువలు అధ్వానంగా మారడంతో చివరి ఆయకట్టకు నీరందడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే కాలువలను బాగు చేయాలి. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
– నారాయణ, రైతు, బాన్సువాడ
నిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువల్లో పిచ్చి మొక్క లు పెరిగాయి. గుర్రపు డెక్క కూడా అల్లుకుపోయింది. పూడిక పెరగడంతో చివరి ఆయకట్టకు నీరు రావడం లేదు. అధికారులు స్పందించి పూడిక తీయాలి.
– గంగాధర్, రైతు, బాన్సువాడ
మండలం ఆయకట్టు
బాన్సువాడ 10,968
బీర్కూర్ 9,431
నస్రుల్లాబాద్ 7,748
వర్ని 5,064
రుద్రూర్ 3,272
మోస్రా 566
చందూర్ 2,513
కోటగిరి 21,370
పదేళ్లుగా మరమ్మతులకు
నోచుకోని ‘సాగర్’ కాలువలు
ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు
చివరి ఆయకట్టుకు అందని సాగునీరు
మరమ్మతులు చేయాలని
కోరుతున్న రైతులు


