ఎల్లారెడ్డి: కేసుల వివరాలను క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్)లో నమోదు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక సిబ్బంది నుంచి ఐజీపీ గౌరవవందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, మాల్ ఖానా, ఆయుధాల భద్రత, స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, సీసీటీఎనన్‌ఎస్ నిర్వహణ తీరును పరిశీలించి అభినందించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మిస్సింగ్ కేసులు, పోక్సో, అట్రాసిటీ, అండర్ ఇన్వెస్టిగేషన్, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సీసీటీఎనన్‌ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్–కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి డిజిటల్ సేవలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని, నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అనుమానిత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, బీట్ పోలీసింగ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి, ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన
పరిష్కరించాలి
ఫిర్యాదుదారులతో మర్యాదగా
వ్యవహరించాలి
మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ తనిఖీ


