భూ సేకరణను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణను వేగవంతం చేయాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

భూ సేకరణను వేగవంతం చేయాలి తొలి మహిళా వీఆర్‌వో ఉద్యోగవిరమణ దరఖాస్తుల ఆహ్వానం ‘ఎస్సైపై చర్యలు తీసుకోవాలి’

బాన్సువాడ : సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనుల్లో భాగంగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో రిజర్వాయర్‌ పనులపై హైదరాబాద్‌లోని తన నివాసంలో పోచారం మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మే 23వ తేదీన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో రిజర్వాయర్‌ ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించేందుకు అవసరమైన అనుమతుల కోసం రూ.55.30 కోట్లు మంజురు చేస్తూ జీవో నం.37ను ద్వారా జూన్‌ 8న ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగాలని అన్నారు. సమావేశంలో ఈఎన్‌సీ జనరల్‌ రమేశ్‌, ఈఎన్‌సీ అడ్మిన్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి మహిళా విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా నియమితులైన జిల్లాకు చెందిన జ్యోతి మంగళవారం ఉద్యోగవిరమణ పొందారు. మూడు దశాబ్దాలపాటు రెవెన్యూశాఖలో వీఆర్వోగా ప్రజలకు సేవలందించారు. ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేయడంతో నాలుగేళ్లుగా ఇరిగేషన్‌లో పని చేశారు. 34 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగి ఇరిగేషన్‌ శాఖ నుంచి రిటైర్‌ అయిన జ్యోతికి అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.

కామారెడ్డి అర్బన్‌: సివిల్‌ సర్వీసెస్‌ యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ కమ్‌ మెయిన్స్‌–2027 ఉచిత కోచింగ్‌ కోసం ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్‌సీ సంక్షేమాధికారి పి వెంకటేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ స్టడీ సర్కిల్‌లో పది నెలల ఉచిత రెసిడెన్షియల్‌ ఫౌండేషన్‌ కోర్సు కోచింగ్‌ కోసం ఈనెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు 19వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని, మరిన్ని వివరాలకు టీఎస్‌ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌లో లేదా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీ జెండాకు సెల్యూట్‌ చేసిన గాంధారి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో ఎస్సై కాంగ్రెస్‌ జెండాకు సెల్యూట్‌ చేసిన ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారులు కాంగ్రెస్‌ తాబేదార్లుగా పనిచేయడం శోచనీయమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement