● రెవెన్యూ అదనపు
కలెక్టర్ విక్టర్
● రహవీర్, పీఎం రహత్
పథకాలపై సమీక్ష
కామారెడ్డి క్రైం: రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహవీర్, పీఎం రహత్ పథకాలపై విస్తృత స్ధాయిలో అవగాహన కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా పథకాల అమలు తీరునుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారిపై ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రమాదం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితుడిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి పీఎం రహత్ పథకం కింద ప్రమాదం జరిగిన తేదీ నుంచి 7 రోజుల వరకు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లభిస్తుందన్నారు. ఇందులో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వైద్య ఖర్చుల భారం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. జాతీయ రహదారులపై మాత్రమే కాకుండా ఇతర రహదారులపై ప్రమాదాలు జరిగినా ఈ పథకం వర్తింస్తుందన్నారు. ప్రమాద బాధితులను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


