బాన్సువాడ: గత ప్రభుత్వం హయాంలో సుమారు రూ.6 కోట్లు వ్యయంతో కల్కి చెరువు కట్ట ఆధునీకరణ పనులు చేపట్టారని, పనులు నాణ్యతతో చేపట్టకపోవడంతో కట్ట దెబ్బతిని తూము వద్ద బుంగ పడిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కల్కి చెరువు తూము పనులను మంగళవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తూము బుంగకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.27 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. పనులను అధికారులు పర్యవేక్షించి నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, నాయకులు ఉమేష్, శ్రీనివాస్, చీకట్ల రాజు, సాయిబాబా, కొండని గంగారం, శంకర్, మహేందర్, ప్రదీప్‌రెడ్డి, ప్రసాద్ ఉన్నారు.
ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలని వినతి..
ఆర్టీసీలో కార్గో సేవలు పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు మంగళవారం ఆర్టీసీ డీఎం రవికుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. గతంలో బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలో ఏర్పాటు చేసిన కార్గో సేవలు ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. ప్రస్తుతం కార్గో సేవలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.


