ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

ఎప్పుడు పాల్గొనాలి.. ఏ అంశాలు ఉంటాయి

ఎవరు ఈ పోటీలో పాల్గొనవచ్చు...

ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి...

ఎల్లారెడ్డి: ప్రతి పౌరుడు తమ తల్లికి గౌరవ సూచకంగా లేదా జ్ఞాపకార్థంగా కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది. 2024 జూన్‌ 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించినా ఈ సంవత్సరం ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంగా పలు రకాల క్విజ్‌ పోటీలు, ప్రశంసా పత్రాలు, విద్యా సంస్థలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, తెలంగాణ గ్రీన్‌ కాప్స్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించబోతుంది.

సెల్ఫీ పోటీలు

ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌(అమ్మ పేరిట మొక్క) కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పోటీలను నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు అమ్మ పేరిట ఒక మొక్క నాటి దానితో సెల్ఫీ తీసుకుని ఎన్‌జీసీ(నేషనల్‌ గవర్నమెంట్‌ క్లౌడ్‌) పోర్టల్లో అప్‌లోడ్‌ చేయాలి. ఫొటో అప్‌లోడ్‌ చేయగానే సెల్ఫీతో కూడిన ఈ–సర్టిఫికేట్‌ జనరేట్‌ అవుతుంది. ఇందులో విద్యార్థులే కాకుండా సాధారణ పౌరులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. ఏ పాఠశాల, కళాశాల నుంచి అయితే ఎక్కువ సర్టిఫికెట్లు జనరేట్‌ అవుతాయో ఆ విద్యా సంస్థకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు, అభినందన ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్‌ అందజేస్తారు. ఈ ప్రోత్సాహకాల మొత్తాన్ని ఆయా విద్యా సంస్థలు విద్యార్థులు నాటిన మొక్కల సంరక్షణకు ఉపయోగించాలి. ఇంతేగాక సీడ్‌బాల్స్‌ (విత్తన బంతులు) తయారు చేసేలా విద్యార్థులను విద్యాసంస్థలు ప్రోత్సహించాలి.

సెల్ఫీ పోటీల గడువు.. సెప్టెంబర్‌ 15

ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ సెల్ఫీ పోటీలు జూన్‌ 19 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్‌ 20న ఫలితాలు వెల్లడవుతాయి. జిల్లాల వారీగా ఎక్కువ మొక్కలు నాటి అత్యధిక స్కోరు సాధించిన ఐదుగురు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు జిల్లా కలెక్టర్‌ అందజేస్తారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చేసిన విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక స్కోరు సాధించిన విద్యార్థులకు, ఎక్కువ విద్యార్థులు పాల్గొన్న జిల్లాకు సీఎం చేతుల మీదుగా అభినందన పత్రాలు ఇస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ(ఎన్‌ఎస్‌పిసి) పేరిట కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.

జులై 1 నుండి ఆగస్ట్‌ 21 వరకు తమకు వీలైన ఏ రోజునైనా వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా పరీక్ష రాయవచ్చు. క్విజ్‌ పరీక్షను ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో రాయవచ్చు. అడవుల రక్షణ, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, గ్లోబల్‌ వార్మింగ్‌, కాలుష్య నివారణ తదితర అంశాలపై క్విజ్‌ పోటీ జరుగుతుంది.

ఈ పోటీలో 1వ తరగతి నుంచి పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌, రీసెర్చ్‌ స్కాలర్స్‌ వరకు ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చు. విద్యార్థులు తమ వయస్సు, తరగతి గ్రూప్‌నకు తగినట్లుగా రూపొందించిన ఆన్‌లైన్‌ క్విజ్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కతో దిగిన సెల్ఫీని రిజిస్ట్రేషన్‌ సమయంలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఎకోమిత్రమ్‌ ఎన్‌ఎస్‌పీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

వెబ్‌సైట్‌లో విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, కళాశాల పేరు, మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలు నమోదు చేయాలి.

మొక్కను నాటుతూ దిగిన సెల్ఫీని అప్‌లోడ్‌ చేయాలి.

అమ్మ పేరిట మొక్క కార్యక్రమానికి

విశేష స్పందన

విద్యార్థులకు పలు రకాల పోటీలు,

ప్రశంసా పత్రాలు

విద్యా సంస్థలకు నగదు ప్రోత్సాహకాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement