కబ్జాలకు అడ్డేది..? | - | Sakshi
Sakshi News home page

కబ్జాలకు అడ్డేది..?

Jun 30 2026 1:24 AM | Updated on Jun 30 2026 1:24 AM

అనుమతులు ఎలా ఇచ్చారో..?

కల్కి చెరువు కాల్వల ఆక్రమణ

పరాధీనంలోకి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

బాన్సువాడ: కబ్జాలకు కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. అధికారుల పట్టింపులేనితనం అక్రమార్కులకు కలిసొస్తుంది. బాన్సువాడలో మత్తడి కాల్వలు కబ్జాకు గురయ్యాయి. పట్టణ నడిఒడ్డున పారే చెరువుల మత్తడి(వ్యవసాయ) కాలువలు పరాధీనమయ్యాయి. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చెరువు కాలువలు జీవం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. బాన్సువాడలో ఏళ్ల తరబడి చెరువుల కాల్వలు(నాలాలు) దురాక్రమణకు గురువుతున్నాయి. పూర్వీకులు వ్యవసాయం కోసం బాన్సువాడకు ఉత్తరం దిశకు కల్కి చెరువును నిర్మించారు. ఈ చెరువు కింద సుమారు 487 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలతో ఈ చెరువు నిండాక ఎల్లయ్య చెరువు, నాగిరెడ్డి చెరువులతో పాటు ఊరు కింద వ్యవసాయ భూములకు సాగునీరందించేందుకు కాల్వలు తవ్వారు. ఈ కాల్వలు నీటిపారుదల, మున్సిపల్‌ శాఖల ఆధీనంలో ఉన్నాయి. గ్రామ పంచాయితీగా ఉన్న బాన్సువాడ నేడు మున్సిపల్‌ స్థాయికి ఎదిగింది. అయితే ఈ కాల్వలు పట్టణం నడి ఒడ్డు నుంచి తవ్వడంతో కొందరు నివాస గృహాల కోసం, మరి కొందరు రియల్‌ ఎస్టేట్‌ కోసం కాల్వలను కబ్జా చేశారు. కల్కి చెరువు కింద పట్టణంలో ఎన్‌జీవోఎస్‌ కాలనీ, సాయికృపానగర్‌, చైతన్య కాలనీ, శ్రీరామకాలనీ, టీచర్స్‌కాలనీలు వెలిశాయి. వ్యవసాయ భూముల్లో భవనాలు, దుకాణాలు నిర్మించారు. దీంతో కల్కి చెరువు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కాల్వల కబ్జాల వల్ల వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చే నీరు కాల్వల్లోకి కాకుండా రోడ్లపైకి, కాలనీల్లోకి వస్తున్నాయి. ఎండాకాలంలో మాత్రం చివరి ఆయకట్టకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.

నిబంధలకు విరుద్ధంగా నిర్మాణాలు..

ఒక్కప్పుడు ఊరు చివరిలో ఉండే కల్కి చెరువు, ఎల్లయ్య చెరువు స్థలాల్లో పట్టణం విస్తరించింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకే వరద పోటెత్తుతోంది. పై నుంచి వచ్చే వరద నీటితో ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కాల్వకు ఎడవ వైపు బైక్‌కు వెళ్లేందుకు 2 మీటర్లు, కుడివైపున ఇరిగేషన్‌ అధికారుల జీపు వెళ్లేందుకు వీలుగా 4 మీటర్లు బఫ్పర్‌ జోన్‌లోని వస్తాయి. ఆయా చోట్ల ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అందుకు విరుద్ధంగా మూడు ఫీట్లలోపే నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కాల్వల గట్లపై నిర్మాణాలు చేపట్టారు. వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కల్కి చెరువు, ఎల్లయ్య చెరువు మత్తడి కాల్వలు అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాల అంచనా. ఒక్కో కాలువ 9 ఫీట్ల వెడల్పుతో ఉండాలి. ప్రస్తుతం కాల్వలకు ఇరుపక్కల కనీసం కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది.

గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు విధులు నిర్వహించిన అధికారులు కాల్వల పక్కన చేపట్టే నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారో తెలియదు. అప్పట్లో చేసిన పొరపాటు వల్లే నేడు సమస్య ఉత్పన్నమైంది. తమ వద్ద జాబితాలో కొన్ని కాలువలు లేవు. కబ్జాకు గురైన కాలువలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

–నితిన్‌, ఇరిగేషన్‌ ఏఈ, బాన్సువాడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement