కామారెడ్డి క్రైం: అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో వ్యాధుల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యాధుల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికునన్‌గున్యా, ఫైలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. ఎవరికై నా జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యుల సూచన లేకుండా ప్రైవేటులో మందులు కొనుక్కుని వాడొద్దని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. వాహక వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, ముందస్తు రక్త పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, లార్వా నిర్మూలన, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


