ప్రశ్నార్థకంగా ‘సాగర్’
● కళ తప్పిన జలాశయాలు
● వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపులు
నిజాంసాగర్(జుక్కల్): వర్షాల జాడలేకపోవడంతో జిల్లాలోని ప్రధాన జలాశయమైన నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగిలిన జలాశయాలు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సీజన్ ప్రారంభమై నెలరోజులవుతున్నా వానల జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బోసిపోతున్న మళ్లింపు పథకాలు
నిజాంసాగర్ ఆయకట్టుకు వరద నీటి మళ్లింపు పథకాలైన కళ్యాణి ప్రాజెక్టుతోపాటు సింగితం రిజర్వాయర్ చుక్క నీరు లేక బోసిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు లేకపోవడంతో నీటి ప్రవాహం కనిపించడం లేదు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 మీటర్లు, సింగితం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.5 మీటర్లు కాగా ప్రస్తుతం జూన్ ముగుస్తున్నా చుక్క నీరు కంటికి కనిపించడం లేదు.
చెరువులు, కుంటలు..
జిల్లాలో మొత్తం 2,069 చెరువులు ఉండగా ఆయకట్టు కింద 97,123 ఎకరాల భూముల్లో రైతులు పంటలు సాగు చేస్తారు. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో రైతులు నిరీక్షిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉండడంతో ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు కింద నారుమడులకు సాగర్ నీరు అందని ద్రాక్షగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1394.74 అడుగుల (6.662 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టడం లేదు. ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన కాలువ పరిధిలో నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు సాగర్ నీటి కోసం ఎదురుచూస్తున్నారు.


