శిథిలావస్థకు చేరిన నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ భవనం
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ భవనాలు కాలం చెల్లినా అందులోనే కొనసాగిస్తున్నారు. పోలీసు సిబ్బందికి నిర్మించిన క్వార్టర్లయితే ఎక్కడా ఉపయోగంలో లేవు. దీంతో సిబ్బంది బయటే ఉంటున్నారు. శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పెచ్చులూడటం, వర్షంతో ఊరుస్తుండటం, కొన్నిచోట్ల కరెంటు షాక్ కొడుతున్నాయి. దీంతో ఆ భవనాల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది భయం గుప్పిట్లో గడపాల్సి వస్తోంది. కాలం చెల్లిన పోలీస్ స్టేషన్ భవనాలకు అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. అయితే గతేడాదిలాగే భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది.
సిబ్బంది క్వార్టర్లు సైతం..
జిల్లాలో పోలీస్ సిబ్బందికి క్వార్టర్లు లేకుండాపోయాయి. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. మాచారెడ్డి, నాగిరెడ్డిపేట పోలీస్ క్వార్టర్లు కూలిపోయే దశలో ఉన్నాయి. ఎల్లారెడ్డిలో పోలీస్ క్వార్టర్లు కూల్చివేశారు. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాడ్వాయి పోలీస్ క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో వాడటం లేదు.
దశాబ్దాల క్రితం నిర్మించిన ఠాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల పెచ్చులూడుతుండగా, మరికొన్ని చోట్ల వర్షమొస్తే జల్లులు పడుతూ ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్‌లకు సొంత భవనాలు కరువయ్యాయి.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కాలం చెల్లి పెచ్చులూడుతున్నాయ్..
తాత్కాలిక మరమ్మతులతో సరి
జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల
పరిస్థితి దయనీయం
మూలనపడ్డ సిబ్బంది క్వార్టర్లు
కొత్త పీఎస్‌లకు సొంత భవనాల్లేవ్..!


