● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లా వ్యాప్తంగా 99,221 మంది
చిన్నారులకు పోలియో చుక్కలు
● నేడు, రేపు ఇంటింటి సర్వే
కామారెడ్డి టౌన్ : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా చుక్కల మందు కార్యక్రమానికి దూరం కాకుండా వందశాతం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, డీఎంహెచ్‌వో వెంకట్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో సంతోష్, మున్సిపల్ కౌన్సిలర్లు గెరికంటి లక్ష్మీనారాయణ, స్వప్న, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


