జిల్లా వ్యాప్తంగా ఆదివారం చేపట్టిన జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,03,678 మంది ఉండగా మొదటి రోజు 99,221 మంది (95.72 శాతం) చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ వెల్లడించారు. జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 733 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 74 మంది రూట్ సూపర్‌వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారని, మారుమూల ప్రాంతాలు, ఇటుక బట్టీలు, సంచార జాతులు, నిర్మాణ రంగ ప్రాంతాల్లోని చిన్నారుల కోసం 22 మొబైల్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసినట్లు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో 36 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేసి చుక్కల మందు వేశారు. పలు బూత్‌లను డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ నర్సింగ్ చౌహాన్, డాక్టర్ రాజు గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు రోహిత్ కుమార్, ప్రదీప్, వెంకటస్వామి తనిఖీ చేశారు. ఆదివారం బూత్‌లకు రాలేకపోయిన చిన్నారులను గుర్తించేందుకు సోమ, మంగళవారాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.


