ఎన్యుమరేషన్‌ ఫామ్‌ నింపి ఇవ్వాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

ఎన్యుమరేషన్‌ ఫామ్‌ నింపి ఇవ్వాల్సిందే!

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

ఓటర్లు అందించాల్సిన పత్రాలు

01–01–2002 నాటికి ఓటు లేకపోతే..

చేయకూడనివి:

01–01–2002 నాటికి ఓటు ఉన్నట్లయితే..

వివరాల్లో తప్పులు లేకుండా చూడాలి

బీఎల్‌వోల వద్ద రసీదు తీసుకోవడం మరువద్దు

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ ఈ నెల 25న ప్రారంభమైంది. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లి్‌ష్‌లో ఉండే ‘ఎన్యూమరేషన్‌ ఫారం’ అందిస్తారు. ఫారంను సరైన వివరాలతో నింపి, మళ్లీ బీఎల్‌వోలకు ఇస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. చాలామంది ఫారాన్ని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. అధికారుల సూచన ప్రకారం.. ఈ ఫారం ఎలా నింపాలో తెలుసుకుందాం..

ఎన్యుమరేషన్‌ ఫారం అంటే?..

ఓటరు జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ప్రాథమిక పత్రం ఎన్యూమరేషన్‌ ఫారం. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఒక వేదిక. ఫారంలో వివరాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా, స్పష్టమైన అక్షరాలతో రాయాలి.

ఫారంలో మూడు విభాగాలు..

పైభాగం: మీ పేరు, మీ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్‌, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి, అక్కడ పక్కన మీ లేటెస్ట్‌ ఫొటో అతికించాలి.

రెండవ భాగం: రెండోభాగంలో రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్‌, 2002లో ఓటు లేనివారి కోసం మరో బాక్స్‌ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకుని వివరాలు నమోదు చేయాలి.

మూడో భాగం: మూడోభాగంలో ఓటరు ప్రస్తుత వివరాలు నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, తల్లిపేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలేయాలి.

జాగ్రత్తలు మరువకండి..

వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, లింగం వంటి వివరాలను ఆధార్‌ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి.

చిరునామా ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నంబర్‌, వీధి పేరు, పోస్ట్‌ ఆఫీస్‌ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.

ఆధార్‌ అనుసంధానం: ఓటర్‌ ఐడీ కార్డును ఆధార్‌ అనుసంధానించడానికి అవసరమైన వివరాలను అందించాలి.

ఫొటో, సంతకం: ఫారం చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మర్చిపోవద్దు.

ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్‌, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడం వల్ల భవిష్యత్‌లో ఓటరు జాబితాలో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.

2002లో మీకు ఓటు హక్కు లేకపోతే.. మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ భాగం పూరించాలి. పేరు అనేచోట తండ్రి, తల్లి తాతయ్య, నాయనమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ వేయాలి. బంధువు అనేచోట తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ (భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్‌ జాబితాలో మీ సీరియల్‌ నంబర్‌ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కావున, మీ బంధువుల్లో ఉన్న వారివివరాలను ఈ బాక్స్‌ నింపాలి.

చేయాల్సినవి:

ప్రతీ కాలమ్‌ను జాగ్రత్తగా చదివి నింపాలి.

పేరు స్పెల్లింగ్‌ అన్ని పత్రాల్లో ఒకేలా ఉందో చూసుకోండి.

పుట్టిన తేదీ అన్ని పత్రాల్లో సరిపోతుందో నిర్ధారించుకోండి.

ఫారం సమర్పించిన తర్వాత రసీదు లేదా అంగీకార పత్రం తీసుకోవాలి.

సందేహాలు ఉంటే బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ను సంప్రదించాలి.

అవసరమైన పత్రాల స్పష్టమైన కాపీలు జతచేయాలి.

మొబైల్‌ నంబర్‌, చిరునామా వంటి వివరాలు లేటెస్ట్‌వి ఇవ్వాలి.

తప్పుడు సమాచారం ఇవ్వకూడదు.

ఖాళీ కాలమ్‌లు వదిలేయకూడదు

ఇతరుల పత్రాలు ఉపయోగించకూడదు.

పత్రాలపై మార్పులు చేసి సమర్పించకూడదు.

తొందరపాటుతో చదవకుండా సంతకం చేయకూడదు.

ఒకే వ్యక్తికి సంబంధించిన విభిన్న వివరాలు ఇవ్వకూడదు.

2002 ఓటరు జాబితా వివరాల ఆధారంగా ఈ భాగం పూరించాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, సంరక్షకుడి పేరు, అతడితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య. పోలింగ్‌ స్టేషన్‌ నంబరు (భాగం సంఖ్య), శ్రమసంఖ్య.. అంటే ఓటరు జాబితాలో మీ సీరియల్‌ నంబర్‌ ఎంత అనేది వేయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement