నిజామాబాద్ రూరల్ : నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు రాజీనామా చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి రోషిని జైస్వాల్ అన్నారు. ఆదివారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి రోషిని జైస్వాల్ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌తో ఎంతో మంది యువకులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రోడ్లపైకి వచ్చే నిరసనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు.20 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువకుల పక్షాన ఛాత్రో కి గుంజ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ఉందామన్నారు.కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినోద్ ఎర్రంశెట్టి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఉపాధ్యక్షులు అద్నాన్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, రాజు గౌడ్, అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్, మోయిన్ యూనిస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.


