తగ్గనున్న 11 కిలోమీటర్ల దూరం..
పోతాయిపల్లి– నందివాడ
లింగంపేట(ఎల్లారెడ్డి): దశాబ్దాలు గడుస్తున్నా పలు గ్రామాల కల నేటికి కలగానే మిగిలిపోయింది. పాలకుల హామీలు, అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. అటవీ భూములు వేల ఎకరాల్లో కబ్జాకు గురవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా అటవీ శాఖ అధికారులు ప్రజలకు ఉపయోగపడే రోడ్డు పనులను అడ్డుకొని నిలిపివేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే లింగంపేట మండలం పోతాయిపల్లి–నందివాడ రోడ్డు. గతంలో నిధులు మంజూరైనా పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోకపోవడం గమనర్హం. పాలకులు, అధికారులు మారుతున్నారు కానీ రోడ్డుకు మోక్షం ఎప్పుడోస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి అనుమతులు తేవడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. లింగంపేట మండలం పోతాయిపల్లి నుంచి నందివాడ మీదుగా కామారెడ్డికి వెళ్లే రోడ్డును పూర్తి చేస్తే పలు గ్రామాల ప్రజలు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఎన్నికలు రాగానే మేము అనుమతులు తెస్తామని హామీలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదు. ఇప్పటికై నా పోతాయిపల్లి–నందివాడ రోడ్డుకు అనుమతులు తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
15 కిలోమీటర్లు.. రూ.1.80 కోట్లు..
2009లో 15 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయిలాపూర్ నుంచి పోతాయిపల్లి వరకు బీటీ రోడ్డు వేశారు. పోతాయిపల్లి నుంచి నందివాడకు అటవీ ప్రాంతం మీదుగా రోడ్డు వేయాలి. ఇందుకోసం గతంలో పోతాయిపల్లి, కోమట్‌పల్లి, అన్నారెడ్డిపల్లి, కేశాయిపేట, సురాయిపల్లి తదితర గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వందల మంది శ్రమదానం చేసి కొమ్మలు కొట్టి, మొరం వేశారు. రోడ్డు కోసం గుంతలు పూడ్చారు. బండ్లబాటను రోడ్డుగా మార్చారు. అయితే అటవీశాఖ అధికారులు తమ పరిధిలోని అటవీ భూమి మీదుగా రోడ్డు వేయడానికి వీలులేదని పనులు నిలిపివేశారు. సుమారు నాలుగు కిలోమీటర్లు బీటీ రోడ్డు ఆగిపోయింది.
రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే లింగంపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. పోతాయిపల్లి–నందివాడ రోడ్డు పూర్తయితే పొల్కంపేట మీదుగా నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లవచ్చు. దూరం, సమయం ఆదా అవుతుంది.
– లెగ్గల రాజు, పర్మళ్ల
రైతులు పండించిన ధాన్యం, కూరగాయలు, కిరాణ దుకాణం సరుకులు కొనుగోలు చేయడం, విక్రయించడానికి నేరుగా కామారెడ్డికి తరలించవచ్చు. రవాణా ఖర్చులు తగ్గుతాయి. పలు గ్రామాలకు, తండాలకు దూరం తగ్గి, సమయం ఆదా అవుతుంది. ప్రజలకు ఉపయోగపడే పనులను అటవీ శాఖ అధికారుల అడ్డుకోవడం సరికాదు.
– పెద్దబోయిన సాయిలు, పోతాయిపల్లి
పోతాయిపల్లి–నందివాడ రోడ్డు నిర్మాణంతో పొల్కంపేట, కన్నాపూర్, అయిలాపూర్, పోతాయిపల్లి, కోమట్‌పల్లి, అన్నారెడ్డిపల్లి, కేశాయిపేట, సురాయిపల్లి, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల, ఎక్కపల్లి, సజ్జన్‌పల్లి, మాలపాటి, లొంకల్‌పల్లితో పాటు పలు తండాల ప్రజలు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఆయా గ్రామాల ప్రజలు ప్రస్తుతం లింగంపేట మీదుగా వెళ్లాలంటే 38 కిలోమీటర్లు దూరం ఉంటుంది. పోతాయిపల్లి–నందివాడ, ఎర్రాపహడ్ మీదుగా 25 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 11 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
దశాబ్దాలు గడిచినా నెరవేరని కల
అనుమతులు తీసుకురాని
ప్రజాప్రతినిధులు, అధికారులు
అటవీ శాఖ అభ్యంతరంతో
నిలిచిపోయిన రోడ్డు పనులు


