యూరియా కొరత లేదు : కలెక్టర్‌ సంగ్వాన్‌ | - | Sakshi
Sakshi News home page

యూరియా కొరత లేదు : కలెక్టర్‌ సంగ్వాన్‌

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

ఎరువుల రేక్‌ పాయింట్‌ పరిశీలన

కామారెడ్డి క్రైం: యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో రేక్‌ పాయింట్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల విక్రయదారులు తప్పనిసరిగా యాప్‌లో నిల్వలను నిర్ధారించాలన్నారు. విక్రయాలు పూర్తిగా ఈ – పాస్‌ యంత్రాల ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూరియా పంపిణీ పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిందన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సాగు విస్తీర్ణం గణనీయంగా తక్కువగా ఉందన్నారు. గతేడాది ఈ సమయానికి 3.30 లక్షల బస్తాలను మాత్రమే కొనుగోలు చేసిన రైతులు ఈ సారి మాత్రం ఇప్పటివరకు 4.08 లక్షల యూరియా బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ యూరియా కొనుగోళ్లు పెరగడం గమనర్హమన్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 1.58 లక్షల యూరియా బస్తాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

సింగూర్‌ సెగ్మెంట్‌లో తాగునీటి వనరులపై సర్వే

కామారెడ్డి క్రైం: సింగూర్‌ రిజర్వాయర్‌ నీటి లభ్యతను సమర్థవంతంగా వినియోగించడంతోపాటు భూగర్భ జలాలను పరిరక్షించే దిశగా సెగ్మెంట్‌ పరిధిలోని జుక్కల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఉన్న 14 మండలాల గ్రామాల్లో తాగునీటి వనరులపై సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి అదనపు కలెక్టర్‌ గిరి, జెడ్పీ సీఈవో చందర్‌, డీపీవో మురళి, డీఆర్‌డీవో దామోదర్‌ రెడ్డి, జిల్లా భూగర్భ జలాల శాఖ, మిషన్‌ భగీరథ అధికారులతో కలిసి ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ గ్రామాల్లో అందుబాటులో ఉన్న చేతి పంపులు, బోర్‌వెల్స్‌, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు, గ్రామీణ తాగునీటి పథకాలను సర్వే చేసి, నీటి వనరుల పరిస్థితిని అంచనా వేస్తుందన్నారు. సర్వే నివేదిక ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో రీఛార్జ్‌ పిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి, భూగర్భ జలాల పునరుద్ధరణతో పాటు తాగునీటి వనరుల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement