కామారెడ్డి టౌన్ : ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సామగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో మల్లికార్జున్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో శనివారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ నిబంధనల అమలుపై చర్చించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా జీవో నంబర్ 1 నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. యూడైస్ (యూడీఐఎస్‌ఈ) పోర్టల్‌లో స్కూల్ ప్రొఫైల్, టీచర్, స్టూడెంట్ మాడ్యూల్స్ వివరాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని యాజమాన్యాలను కోరారు.
నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


