సాగు ఆగమాగం! | - | Sakshi
Sakshi News home page

సాగు ఆగమాగం!

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

సాగు ఆగమాగం! వర్షాల్లేక ఇబ్బంది పడుతున్నం వర్షం కోసం ఎదురుచూస్తున్నం..

పడిపోతున్న భూగర్భ జలమట్టం

ప్రతి ఏడాది వరి సాగు చేసేవాళ్లం. ఈ సారి వర్షాల్లేకపోవడంతో వరి నుంచి తప్పుకుని ఆరుతడి పంటలు వేయాలని ప్రయత్నం చేస్తున్నా. అయినా ఆరుతడి పంటలకు కూడా నీరు అందే పరిస్థితి లేదు. మూడెకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేశా. అంతర పంటగా మక్క వేసిన. ఏమవుతుందో ఏమో చూడాలి.

– యాదిరెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట

వర్షాలు రాకపోవడంతో బోర్లలో ఊటలు తగ్గి ఇబ్బంది అవుతోంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నం. ఈ సారి కాలం ఇబ్బంది పెడుతోంది. నాకున్న నాలుగెకరాల భూమిలో పంట వేయాలంటే వెనకాముందు ఆలోచించాల్సి వస్తోంది. ఈ సారి కాలం ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. కాలం అయితేనే ముందుకు వెళతాం.

– రాజారాం నారాయణ, రైతు, లింగంపేట

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలం మొదలై నెల రోజులు కావొస్తున్నా జిల్లాలో గట్టి వాన ఒక్కటీ కురవలేదు. వాగులు కాదు కనీసం చిన్న చిన్న ఒర్రెలూ పారలేదు. సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటికీ నేల కూడా సరిగా తడవలేదు. అక్కడక్కడా విత్తనాలు వేసిన రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. బోర్ల మీద ఆధారపడి నారుమడులు పోసిన రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టు కింద కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తున్నారు. జిల్లాలో 5.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి వరకు కేవలం 7,984 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. మెట్ట ప్రాంతాల్లో మక్క, సోయా, పత్తి విత్తనాలు కొద్దిమేర వేయగా, బోర్లు, బావుల వద్ద వరి నారుమడులు పోస్తున్నారు. అయితే భూగర్భజలమట్టం పెరగకపోగా, రోజురోజుకూ పడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్‌ ఆరంభమైన నాటి నుంచి శనివారం వరకు 118.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 83.7 మి.మీ. నమోదైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, మహమ్మద్‌నగర్‌ మండలాల్లో తేడా ఎక్కువగా ఉంది. బీబీపేట, డోంగ్లీ, మాచారెడ్డి, రాజంపేట, గాంధారి, నిజాంసాగర్‌, పిట్లం, బాన్సువాడ, బీర్కూర్‌, పెద్దకొడప్గల్‌, మద్నూర్‌ మండలాల్లో కూడా అరకొర వర్షాలు కురిశాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ

వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతాంగం దుక్కులు దున్ని పంటల సాగుకు భూమిని సిద్ధం చేశారు. వర్షాలపైనే ఆధారపడి సేద్యం చేసే జుక్కల్‌ నియోజక వర్గంలోని జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం తదితర మండలాల్లో ఇటీవల కురిసిన జల్లులతో పత్తి, సోయా, మక్క తదితర పంటలకు సంబందించి విత్తనాలు వేస్తున్నారు. గాంధారి, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, సదాశివనగర్‌, మాచారెడ్డి, కామారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో రైతులు కొన్ని చోట్ల మక్క, సోయా, పత్తి విత్తనాలు వేశారు. చాలా చోట్ల విత్తనం వేయలేదు. భారీ వర్షాలు కురిసిన తరువాతే విత్తనం వేయాలని భావిస్తున్నారు. చెరువులు, బోర్ల కింద వరి సాగు చేయడానికి రైతులు కొద్దిమంది నారుమడులు పోశారు. అయితే వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారుమడులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రైతులు ట్యాంకర్లతో నీరు పట్టిస్తుంటే, మరికొన్ని చోట్ల బిందెలతో చల్లుతున్నారు. ఇంకొందరు రైతులు ఇరుగు పొరుగు రైతుల నుంచి నీరు పైపుల ద్వారా తీసుకుని నారుమడులకు పట్టిస్తున్నారు. మక్క, సోయా, పత్తి విత్తనాలు వేసిన రైతులు కొన్ని చోట్ల స్ప్రింక్లర్లతో నీటిని చిమ్మిస్తున్నారు.

వర్షాకాలం సీజన్‌ ఆరంభమైన తరువాత భూగర్భజలమట్టం పెరగాల్సి ఉండగా, ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట ప్రాంతమైన సదాశివనగర్‌, రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, గాంధారి, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, భిక్కనూరు, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో భూగర్భజలమట్టం పడిపోతోందని భూగర్భజలశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వానాకాలం సాగు కోసం కొందరు రైతులు బోర్లు తవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉన్న బోర్లలో లోతు తవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోర్లు పడడం లేదని రైతులు అంటున్నారు. మళ్లీ బోర్ల తవ్వకంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

వానాకాలం మొదలై నెల రోజులు!

గట్టి వాన ఒక్కటీ కురవలేదు

ఒర్రెలు పారలేదు..

చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదు

భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరం

ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో అయోమయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement