ఏసీబీ చేతిలో ఆధారాలు!
ఆబ్కారీ శాఖలో అక్రమార్కులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఏకంగా డైరీ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎకై ్సజ్ అధికారులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో దీనిపై ఏసీబీ కూపీ లాగుతున్నట్లు తెలిసింది. మద్యం వ్యాపారం, కల్లు బట్టీలు, పర్మిట్ రూమ్‌ల కోసం పలువురు మామూళ్లు వసూలు చేసి కోట్లకు పడగలెత్తినట్లు గుర్తించినట్లు సమాచారం. – నిజామాబాద్‌అర్బన్
ఎకై ్సజ్ శాఖలో ప్రతినెలా వసూళ్లకు సిబ్బంది కొందరు డైరీని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన ఓ కానిస్టేబుల్ ఈ డైరీని సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. కల్లుబట్టీలు, వైన్‌షాప్‌లు, పర్మిట్ రూముల వద్ద ప్రతినెలా మామూళ్లు వసూలు చేయడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి మామూళ్లను పెంచడం, ఏ అధికారికి ఎంత వాటా పంపిస్తున్నారు అన్న వివరాలను క్షుణ్ణంగా ఆ డైరీలో రాసినట్లు తెలిసింది. అయితే ఈ డైరీని ఎవరు నిర్వహిస్తున్నారనే దానిపై ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం.
కోట్లకు పడగలెత్తిన ఘనులు
ఎకై ్సజ్ శాఖలో కొందరు సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయారు. పైస్థాయి అధికారులకు నెలవారీగా మామూళ్లు అందిస్తూ కిందిస్థాయిలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు విధులకు గైర్హాజరవుతూ హాజరైనట్లుగా వేతనాలు పొందుతున్నట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ అరెస్టు కావడంతో ఇదే శాఖలోని మరికొంత మంది అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. మామూళ్లకు అలవాటు పడిన మరికొందరు అధిక మొత్తంలో అక్రమార్జన చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● ఓ కానిస్టేబుల్ నాలుగు నెలల క్రితం విదేశీ పర్యటనకు వెళ్లి 28 రోజులపాటు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ 28 రోజులు విధు ల్లో ఉన్నట్లు రిజస్టర్లలో సంతకం చేసినట్లు తెలిసింది. ఇతడికి వినాయకనగర్ ప్రాంతంలో రెండు బహుళ అంతస్తులు, రెండు ప్లాట్లు, హైదరాబాద్‌లో నాలుగు ఫ్లాట్లు, రెండు లగ్జరీ కార్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
● యూనియన్ నాయకుడైన మరో ఉద్యోగి అక్రమాలపై ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు వెళ్లినట్లు తెలిసింది. సదరు ఉద్యోగి జిల్లాలోని వైన్‌షాప్‌ల యజమానులు తన వద్దే నిర్వహణ రిజిస్టర్లు కొనాలనే నిబంధన విధించినట్లు తెలిసింది. నవీపేట మండలంలో ఈ ఉద్యోగికి 80 ఎకరాల వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రంలో రెండు బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు సమాచారం.
● అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన మరో కానిస్టేబుల్‌కు ఎల్లమ్మగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ప్లాట్లు, దానికి సమీపంలో మరో బహుళ అంతస్తుల భవనం, నవీపేట మండలంలో 50 ఎకరాల వ్యవసాయ భూమి, బాన్సువాడలో 10 ప్లాట్లు, మోపాల్ మండలంలో విశాలమైన ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిసింది.
గాడిలో పడేనా?
జిల్లా ఎకై ్సజ్ శాఖ డీసీగా శ్రీధర్, అసిస్టెంట్ కమిషనర్‌గా అరుణ్‌కుమార్, సూపరింటెండెంట్‌గా నందగోపాల్ ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. వీరికి ప్రధానంగా ఆబ్కారీ శాఖలోని అక్రమార్కులను నియంత్రించి, శాఖపై ఉన్న అపవాదును తొలగించాల్సిన బాధ్యత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందిని ఎలా గాడిలో పెడతారోననే చర్చ జరుగుతోంది.
ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరెస్టుకు ముందే ఆబ్కారీ శాఖపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది మామూళ్ల వ్యవహారంపై పక్కా ఆధారాలను సంపాదించినట్లు సమాచారం. ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించినట్లు తెలిసింది. ఇదంతా మామూళ్లు ఇచ్చే వారు తమ డైరీలో ఎవరికి ఎంతెంత ముట్టజెప్తున్నామనే విషయాలను రాసుకోవడంతోనే బయటపడినట్లు తెలిసింది. నందిపేటకు చెందిన ఓ వ్యక్తి 14 గ్రామాలకు కల్లు తయారు చేసి సరఫరా చేస్తున్నాడని, అతని వద్ద నుంచే అధికారుల మామూళ్ల వ్యవహారం బయటపడినట్లు తెలిసింది.
ఆబ్కారీలో మరిన్ని తిమింగలాలు
విధులకు డుమ్మా.. వసూళ్లకే ప్రాధాన్యత
నెలనెలా మామూళ్ల వసూలు
ఆరు నెలలకోసారి రేటు పెంపు
ఏ అధికారి వాటా ఎంత?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దైనందిని
చిట్టా లాగుతున్న అవినీతి నిరోధక శాఖ


