కలలు కల్లలై.. కన్నీరు వరదై.. | - | Sakshi
Sakshi News home page

కలలు కల్లలై.. కన్నీరు వరదై..

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

కలలు కల్లలై.. కన్నీరు వరదై..

స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు..

భిక్కనూరు: బాగా చదివి కుటుంబానికి పేరు తెస్తాడ నుకున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. దూర దేశంలో విగత జీవిగా మారాడని తెలిసి ఏకధారగా రోదిస్తున్నారు. తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని మంజుల మధుసూదన్‌రెడ్డిలకు ఇద్దరు సంతానం. కూతు రు శ్రావణికి వివాహమైంది. కుమారుడు శ్రీనాథ్‌రెడ్డిని ఉన్నత విద్య కోసం 14 నెలల క్రితం లండన్‌ పంపించారు. దీనికోసం రూ. 30 లక్షల వరకు వెచ్చించారు. ప్రస్తుతం లీసెస్టర్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనాథ్‌రెడ్డి.. అక్కడ తన గదిలో రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసిన క్షణం నుంచి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్‌రెడ్డి మృతిని బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పండగలు, పుట్టిన రోజులకు తమకు ఫోన్‌లు చేసి శుభాకాంక్షలు తెలిపేవాడని గుర్తు చేసుకుంటున్నారు. కాగా శుక్రవారం సమీప బంధువు మనీష్‌ రెడ్డి సమక్షంలో లండన్‌ పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు.

తలమడ్ల గ్రామస్తులు, మృతుడి బంధువులు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని కలిసి శ్రీనాథ్‌రెడ్డి మృతి విషయాన్ని తెలిపారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి భారతీయ రాయబార కార్యాలయంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న తన బంధువుతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. మృతదేహాన్ని త్వరగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

లండన్‌లో కొడుకు మృతి

కంటికిమింటికి ఏకధారగా

రోదిస్తున్న తల్లిదండ్రులు

త్వరగా మృతదేహాన్ని రప్పించాలని

షబ్బీర్‌ అలీని కోరిన బంధువులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement