వేరే ఏఈవోను నియమించాం
అవగాహన కల్పించలేదు
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నరకం వరి విత్తనాలనే సాగు చేయాలని, వాటిని రైతు వేదికలో పెట్టి మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు ఆదేశాలు పాటించడం లేదు. వరి విత్తనాల మేళా బిచ్కుంద మండలంలో కొనసాగడం లేదు. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 రకాల సన్నరకం వరి విత్తనాలతో సాగు చేస్తేనే క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తామని ప్రకటించింది. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికల్లో ఈ నెల 30 వరకు విత్తన మేళాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు అందాయి. బిచ్కుంద మండలంలో ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. ఈ నెల 23న ఒక గంట పాటు మేళా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. అనంతరం రైతు వేదికకు తాళం వేసి వెళ్లిపోయారు. సన్నరకంపై అవగాహన కల్పించకపోవడంతో ఇతర రకాల వరి సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు.
అందుబాటులో లేని ఏడు రకాల విత్తనాలు..
ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలు సాగు చేస్తేనే బోనస్ లభిస్తుందని ప్రకటించడంతో రైతులు ఆ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో పాటు ఏఈవోలు కూడా అందుబాటులో ఉండడం లేదు. మంజీరా నది పరివాహక ప్రాంతం హజ్గుల్, శెట్లూర్, మెక్కా, ఖద్‌గాం, బండారెంజల్ గ్రామాలలో రైతులు ప్రభుత్వం ప్రకటించిన వరి విత్తనాల గురించి తెలియక సుమారు 600 ఎకరాలలో ఇతర సన్నరకం వరి పంట సాగు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో వరి నాట్లు కూడా వేస్తున్నారు.
విధులకు ఏఈవోల డుమ్మా..
ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాల్సిన ఏఈవోలు విధులకు రాకుండా డుమ్మాలు కొడుతున్నారు. ఏఈవోలు నెలలో మూడు నాలుగు రోజులు మాత్రమే వస్తున్నారు. పెద్దదేవాడ ఏఈవో చిన్నదడ్గిలో పంట నమోదులో తప్పులు చేశారు. ఓ రైతు జొన్న సాగు చేయకపోయినా చేసినట్లు నమోదు చేయడంతో పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం విచారణ చేపట్టి ఏఈవోపై సస్పెన్షన్ వేటు వేశారు. హజ్గుల్ ఏఈవో భానుప్రసాద్ నెలలో మూడు నాలుగు రోజులు మాత్రమే విధులకు వస్తారు. మండలంలో ఒకరిద్దరు ఏఈవోలు తప్ప అందరు డుమ్మాలు కొడుతున్నారని రైతులు ఎన్నో సార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. బిచ్కుందలో ఏడీఏ కార్యాలయం ఉంది. మూడేళ్ల నుంచి పోస్టు ఖాళీ ఉంది. మూడేళ్ల క్రితం ఫర్టిలైజర్ షాపు లైసెన్సు విషయంలో ఏవో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో సస్పెండ్ అయ్యారు. ఏవో, ఏడీఏ పోస్టు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంది. కార్యాలయానికి వెళ్తే ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. నిజాంసాగర్ ఏవో అమర్ ప్రసాద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. నిజాంసాగర్ మండలంలో 90 శాతం మంది రైతులు వరి సాగు చేస్తారు. అక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు బిచ్కుంద వచ్చి వెళ్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మండలంలో పర్యటించి విచారణ చేపట్టి విధులకు డుమ్మాలు కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఏడీఏ, ఏవో పోస్టు భర్తీ చేయాలని మండల రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
బిచ్కుందలో మూసి ఉన్న రైతు వేదిక
ఏఈవోలు విధులకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదు రావడంతో హజ్గుల్, దడ్గిలో వేరే ఏఈవోలను నియమించాము. ఈ నెల 30 వరకు విత్తన మేళా నిర్వహించాలి. పంటల సాగు పై అవగాహన కల్పించాలని ఏఈవోలకు తెలియజేశాం. విధులకు రానివారిపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.
– అమర్ ప్రసాద్, ఇన్‌చార్జి ఏవో, బిచ్కుంద
సన్నరకం వరి విత్తనాల గురించి ఖద్‌గాంలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించలేదు. మేము నాట్లు వేస్తున్నాము. 250 ఎకరాలలో ఇతర వరి పంట సాగు చేస్తున్నాం. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. సన్నరకం విత్తనాలు ఎక్కడ ఉన్నాయి. అడ్రస్ కూడా ఏఈవో చెప్పడం లేదు. మా గ్రామానికి హజ్గుల్ ఏఈవో రెండు నెలలకు ఒకసారి కూడా రారు. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు.
– ప్రభాకర్, రైతు ఖద్‌గాం
ఈ నెల 30 వరకు రైతువేదికల్లో
విత్తనాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాలు
బిచ్కుందలో రైతు వేదికలకు
తాళాలు వేసిన అధికారులు
నెలలో నాలుగు రోజులే
విధులకు వస్తున్న ఏఈవోలు
మూడేళ్ల నుంచి ఏడీఏ, ఏవో పోస్టులు
కూడా ఖాళీగా ఉన్న వైనం


