● లండన్‌లో తలమడ్ల యువకుడు మృతి
భిక్కనూరు: రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన యువకుడు లండన్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు గురువారం తెలిసింది. గ్రామానికి చెందిన సావుసాని మధుసూదన్‌రెడ్డి–మంజుల దంపతుల కొడుకు సావుసాని శ్రీనాథ్‌రెడ్డి (25) పద్నాలుగు నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ లేయిసిస్టర్ పట్టణంలోని యూనివర్సీటీలో ఎంఎస్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 22న రాత్రి స్నేహితుడి పుట్టినరోజు విందుకు హాజరై తన గదికి వచ్చి నిద్రపోయాడు. గురువారం ఉదయం గదిలో ఉండే స్నేహితుడు వచ్చి చూడగా శ్రీనాథ్‌రెడ్డి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని లండన్‌లోనే ఉంటున్న శ్రీనాథ్‌రెడ్డి బంధువులకు సమాచారం అందించగా వారు తలమడ్లలో ఉన్న తల్లిదండ్రులకు తెలిపారు. శ్రీనాథ్‌రెడ్డి కామారెడ్డిలో ఇంటర్, హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లాడు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం పొందుతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరకు దు:ఖమే మిగిలింది.


