కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేసేందుకు 10 రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన కేరళ టీచర్ దేవిక ఉల్లాస్ (25) బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తాయి. మృతురాలి తల్లి డాలీ కేరళ నుంచి గురువారం కామారెడ్డికి చేరుకున్నారు. దేవిక ఉల్లాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురయ్యేదని, అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని దేవునిపల్లి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
మానసిక స్థితి బాగోలేక వివాహిత..
ఇందల్వాయి: మానసిక స్థితి బాగోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అన్సాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామానికి చెందిన తాళ్ల శ్రావణికి ఇందల్వాయి మండలం అన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా శ్రావణి ఇంటి వద్ద ఉంటుంది. తరచూ మానసిక ఆందోళనతో బాధపడే శ్రావణి సరైన చికిత్సలేక మానసిక వ్యాధి ముదిరి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, తండ్రి పెద్దగంటి నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


